హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఒక అనుభవం గుణపాఠం కావాలి. మంచి కోసం బాటలు వేయాలి. కానీ పుర్రెలో తప్పుడు ఆలోచన ఉంటే అదే అనుభవం కొత్త రకం అవినీతికి దారి చూపుతుంది. శ్రామికుల చెమట చుక్కలతో నడుస్తున్న సింగరేణి వంటి సంస్థను నిండా ముంచేందుకు మార్గంగా మారుతుంది. దేశంలోని ఇతర ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కనిపించని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ విధానం రెండో కోవలోకే వస్తుంది. సింగరేణి సంస్థకు నష్టం చేకూరేలా ఒక అనుభవం ఎదురైనప్పుడు దానిని సరిదిద్దుకొని సంస్థ ఖజానాకు గండి పడకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ప్రభుత్వ పెద్దలు గద్దల్లా వాలిపోయారు. తమ అనుయాయులకు రూ.వేల కోట్ల టెండర్లను కట్టబెట్టేందుకు సరికొత్త నిబంధనలకు ఊపిరి పోశారు. అయితే ఆశ అత్యాశగా మారడంతో.. పెద్దల మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. చివరికి బజారుకెక్కింది. 2024లో సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట పడిన అవినీతి బీజంతో ముఖ్యనేత సమీప బంధువువే తొలి లబ్ధిదారు అనే వాస్తవం వెలుగుచూసింది.
తెర వెనుక కథ ఇది!
సింగరేణి సంస్థలో గతంలో ఒక పనికి సంబంధించి కాంట్రాక్టర్ నిబంధనల మేరకు సంతృప్తికరంగా పనులు చేయనట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సంబంధిత అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు జరిమానా విధించారట! తాను జరిమానా చెల్లించనంటూ మొండికేసిన సదరు కాంట్రాక్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని సమాచారం. పనికి సంబంధించిన సైట్‌పై (భౌగోళిక పరిస్థితులు) తనకు పూర్తి అవగాహన లేదని, కాబట్టి నిర్ణీత ప్రమాణాల మేరకు పని చేయలేక తానే నష్టపోయానని కోర్టు ముందు వాపోయినట్టు తెలిసింది. దీంతో కోర్టు ఆ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు సింగరేణి వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో అధికారులు ఆలోచనలో పడ్డారట! సరిగా పనిచేయని కాంట్రాక్టర్లపై జరిమానా విధిస్తే పని చేసే ప్రాంత భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదంటూ ఈ తీర్పును ఆసరాగా చేసుకొని తప్పించుకునే అవకాశం ఉంటుందని చర్చించుకున్నట్టు సమాచారం. తద్వారా ఓవైపు పని పూర్తికాక సంస్థకు నష్టం కలుగడంతోపాటు నిబంధనల మేరకు కాంట్రాక్టర్‌పై విధించే జరిమానా కూడా రాకుండాపోతుందని భావించారట! రెండువైపులా సంస్థ నష్టపోయే అవకాశమున్నందున దీనికి చెక్ పెట్టేందుకు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడినట్టు సమాచారం.
కాంట్రాక్టర్‌కే బాధ్యత అప్పగించాల్సిందిపోయి..
సాధారణ టెండర్లలోనూ బిడ్ వేసే ముందు కాంట్రాక్టర్లు పనిచేసే ప్రాంతాన్ని సందర్శించి టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాలతో బేరీజు వేసుకుంటారు. ప్రీబిడ్ సమావేశంలో తమ అనుభవాలు, సమస్యలు, అభ్యంతరాలను అధికారుల ముందు ఉంచి పరిష్కారాలు, వెసులుబాట్లను ప్రతిపాదిస్తారు. కానీ సింగరేణి టెండర్లు మైనింగ్‌కు సంబంధించినవైనందున భౌగోళిక పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఇప్పటికే కాంట్రాక్టర్ జరిమానా తప్పించుకున్న అనుభవంతో ఇకముందు అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కచ్చితంగా టెండర్ నోటిఫికేషన్లోనే కొత్త షరతులు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ‘అంతా కాంట్రాక్టర్‌దే బాధ్యత’ అన్నట్టుగా టెండర్ నోటిఫికేషన్లో కొత్త షరతు విధిస్తారు. బిడ్ దాఖలు సమయంలోనే ‘మేము సైట్‌ను చూశాం. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించిన తర్వాతే పని చేసే ఆసక్తితో బిడ్ దాఖలు చేస్తున్నాం. తదుపరి ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా పూర్తి బాధ్యత మాదే’ అని సదరు కాంట్రాక్టర్ అండర్‌టేకింగ్ (అంగీకార ధ్రువీకరణ పత్రం) సమర్పించాలనే నిబంధన విధిస్తే సరిపోయేది. తద్వారా ఆ కాంట్రాక్టర్ పని చేయకుండా, జరిమానాలు తప్పించుకునేందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయించినప్పుడు అండర్‌టేకింగ్‌ను కోర్టుకు సమర్పిస్తే సంస్థకు నష్టం జరగకుండా ఉంటుంది.
పాత టెండర్లు రద్దు చేసి కొత్త నిబంధన
ఒడిశా అంగూల్ జిల్లాలోని నైని కోల్‌బ్లాక్‌ను 2015లో దక్కించుకున్న సింగరేణి సంస్థ, 2200 ఎకరాల విస్తీర్ణంలోని ఆ బ్లాకులో 200 ఎకరాల విస్తీర్ణానికి బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పూర్తి చేసి, పనులు అప్పగించింది. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో ఐదేండ్ల పాటు బొగ్గు వెలికితీతకు పిలిచిన ఆ టెండర్లలో ఐదు సంస్థలు పోటీపడ్డాయి. చివరికి నిబంధనల ప్రకారం మైనింగ్‌ల సుదీర్ఘ అనుభవం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ సంస్థ టెండర్ దక్కించుకున్నది. రోజుకు 30వేల క్యూబిక్ మీటర్ల ఓబీని ఈ సంస్థ వెలికి తీస్తున్నది. అయితే మిగిలిన రెండు వేల ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీఆర్) విధానంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే టెండర్లు జారీ అయ్యాయి. అయితే ఆలోగా సర్కార్ మారడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ టెండర్లను రద్దు చేసింది. ఎక్కడాలేని విధంగా కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానంతో టెండర్లు పిలిచింది. కాగా ఇప్పటికే గత డిసెంబర్లోనే కాంట్రాక్టర్లతో ప్రీబిడ్ సమావేశం కూడా పూర్తయినట్టు తెలిసింది.
సాధారణంగా కాంట్రాక్టర్లు బొగ్గు బ్లాక్‌ను పరిశీలించి, పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ప్రీబిడ్ సమావేశానికి హాజరవుతారు. అందులో తమ సందేహాలు, సమస్యల్ని అధికారుల ముందుంచుతారు. ఇక్కడ కీలక విషయమేమిటంటే.. ప్రీబిడ్ సమావేశం పూర్తయి దాదాపు నెల గడుస్తున్నా నైని బ్లాకుకు సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఏ ఒక్క కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. నిజంగా ఈ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాలనుకుంటే సైట్‌ను పరిశీలించిన ప్రతి కంపెనీకి ఇప్పటికే సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉన్నది. ఆ మేరకు సుశీ కంపెనీతో పాటు పలు కంపెనీలు కూడా పదేపదే అధికారులకు ఫోన్ చేసి తమకు సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతున్నా అధికారులు జారీ చేయలేదంటే.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల కోసం వేచి చూస్తున్నారనేది బహిరంగ రహస్యం. అయితే నైనీ టెండర్లకు సంబంధించి అసలు ఈ సర్టిఫికెట్ ఎవరు జారీ చేయాలనే దానిపైనా సింగరేణిలో స్పష్టత లేదనే ప్రచారం జరుగుతుందంటే ప్రక్రియ ఎంత గుడ్డిగా కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ మీద ఏడవకుండా ‘పలుకు’ గడవని రాధాకృష్ణ
కేసీఆర్ మీద ఏడవకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పూట గడవదు, ‘పలుకు’ సాగదనేది జగమెరిగిన సత్యం. తాజాగా అదే పునరావృతమైంది. ఓవైపు కంపు రాజకీయంలోకి బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులను లాగిన ప్రభుత్వ పెద్దల బాగోతం నానా రచ్చ అయి అందరి వేళ్లూ ‘ముఖ్యనేత’ వైపు చూపుతున్నాయి. దీంతో ఆదరాబాదరగా రంగంలోకి దిగిన రాధాకృష్ణ ఆ రచ్చకు నైని బొగ్గు మసిని పూసి ‘ముఖ్యనేత’ను కాపాడేందుకు నానా తంటాలు పడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులోకి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంను లాగి తన ఇగోను సంతృప్తిపరుచుకోవడమే ఇక్కడ హాస్యాస్పదం. బీఆర్ఎస్ హయాంలో నైని బొగ్గు గనుల టెండర్లు జారీకాగా, అందులో ఐదు సంస్థలు పోటీ పడ్డాయి. కోల్‌కతాకు చెందిన అంబే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీకి చెందిన కరమ్జిత్సింగ్ అండ్ కంపెనీ, గుజరాత్‌కు చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌కు చెందిన జిందాల్ వపర్ లిమిటెడ్, గుజరాత్‌కు చెందిన దుర్గా ఇన్ఫ్రా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పోటీపడ్డాయి. ఈ ఐదు సంస్థలు కేవలం బిడ్స్ దాఖలు చేయగా, టెండర్లు ఖరారు కాలేదు. పనులు ఎవరికీ కట్టబెట్టలేదు. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. కానీ సదరు రాధాకృష్ణ తన కొత్త పలుకులో మాత్రం ప్రతిమా శ్రీనివాస్‌కు కట్టబెట్టే ప్రయత్నం జరిగితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుకున్నారని రాసుకొచ్చారు. అసలు టెండర్లలో పాల్గొనని సంస్థకు పనులు ఎలా కట్టబెడతారో ఆయనకే తెల్వాలి. పైగా సైట్ విజిట్ సర్టిఫికెట్ హాస్యాస్పదం, అనుయాయుల కోసమే ఈ విధానం, అక్రమం అంటూ పలుకులు పలికిన ఆయన ఆ సర్టిఫికెట్ ద్వారా ఇప్పటికే పనులు కట్టబెట్టిన టెండర్ల వ్యవహారం, పనులు దక్కించుకున్న ముఖ్యనేత అనుయాయులు ఎవరనేది కూడా చెప్తే బాగుండేదని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
సర్కార్ పెద్దల జోక్యంతో గాడి తప్పి..
సింగరేణికి నష్టం కలుగకుండా ఉండేందుకు మొదలైన తర్జనభర్జన.. చివరికి సర్కార్ పెద్దల రంగ ప్రవేశంతో గాడి తప్పినట్టు తెలుస్తున్నది. టెండర్ నోటిఫికేషన్లో కొత్త నిబంధన చేర్చాల్సి ఉన్నదనే ఆవశ్యకతను ఆసరాగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు వినూత్నంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ను తెరపైకి తెచ్చారు. అంటే పని చేసేందుకు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్ అన్నింటికీ తానే బాధ్యుడిని అంటూ ముందుకొచ్చినా దానిని అధికారులు ధ్రువీకరించాలనే నిబంధన విధించారు. ఇక్కడే పారదర్శకంగా జరగాల్సిన టెండర్ల ప్రక్రియ సర్కార్ పెద్దల కనుసన్నల్లోకి వచ్చి పడింది.