Seetharama Project | భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ములకలపల్లి/ వైరా టౌన్, ఆగస్టు 11: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరబోతున్నది. ఈ జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతమైంది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం సమీపంలోని వీకే రామవరం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంపుహౌస్ ట్రయల్ రన్‌ను స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు.
అనంతరం కమలాపురం వద్ద నిర్మిస్తున్న మూడో పంపుహౌస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి సీతారామ ప్రాజెక్టు రెండు, మూడు పంపుహౌస్‌లను ప్రారంభిస్తారని చెప్పారు.
అనంతరం వైరా మండలంలో నిర్వహించే రుణమాఫీ రైతుసదస్సులో కూడా సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా తీసుకున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందిస్తామని చెప్పారు. భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతుల చిరకాల వాంఛ నెరవేరుతున్నదని అన్నారు. గోదావరి జలాలు నాగార్జునసాగర్ ఆయకట్టుకు చేరనున్నాయని వివరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు చివరి భూములకు సాగర్ నీళ్లు రాని సమయంలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి ఏన్కూరు ఎన్ఎస్పీకి అనుసంధానం చేసి 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.
సీతారామ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తుమ్మల చెప్పారు. ఉమ్మడి జిల్లా ఆయకట్టుకు కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లను అందిస్తామని వివరించారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయని పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా రైతుల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు.
అనంతరం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి వైరాలో నిర్వహించనున్న రైతు సదస్సు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ప్రభుత్వ ముఖ్య సలహదారు పెంటారెడ్డి, ఎస్పీ రోహిత్‌రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.