హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి మంత్రి ఉత్తమ్ చర్చించారు. సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. సత్తుపల్లి ట్రంక్ పనులు, పంప్‌హౌస్-4 నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల్లో సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలని, సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణాన్ని రాబోయే మూడేళ్లలో పూర్తిచేయాలని సూచించారు.