హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో పని ప్రదేశాలను వదిలివెళ్లరాదని మంత్రి సీతక్క ఆదేశించారు. రహదారులు, కల్వర్టులు, భవనాల పునరుద్ధరణలో ఆలస్యం చేయకుండా వేగంగా స్పందించాలని సూచించారు. వర్షాలు తగ్గిన వెంటనే కలెక్టర్ల వద్ద ఉన్న నిధులతో తాతాలిక మరమ్మతు పనులను తక్షణం పూర్తి చేయాలని చెప్పారు. ఆదివారం పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు మొత్తం 86.55 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని, రోడ్లు, ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణకు రూ.150 కోట్ల వరకు అవసరమవుతాయని అధికారులు నివేదించారు. వరదల కారణంగా 66 రహదారులు, 83 క్రాస్డ్రైన్ పనులు, 60 చోట్ల గండ్లు పడినట్టు తెలిపారు.