KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. నామినేషన్లకు చివరి రోజున తనను సిట్ విచారణకు పిలవడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు అధికారులు వెనక్కి తగ్గారు. సీర్పీసీ ప్రొసీజర్స్‌లోని పలు అంశాలను లేవనెత్తుతూ గులాబీ బాస్ రాసిన లేఖతో సిట్ కంగుతిన్నది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.
రేపు విచారణకు హాజరు కాలేను అంటూ కేసీఆర్ రాసిన లేఖపై సిట్ అధికారులు స్పందించారు. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని భావిస్తున్నామని, న్యాయ సలహా తీసుకున్నాకే మరొకసారి నోటీసులు ఇస్తామని వారు తెలిపారు. విచారణ తేదీ, ఎక్కడ విచారణ జరపాలి? అనే అంశాలపై న్యాయ నిపుణులను సంప్రదించాకే ముందుకెళ్తామని సిట్ అధికారులు వెల్లడించారు. దాంతో.. శుక్రవారం కేసీఆర్ సిట్ విచారణ వాయిదాపడింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు గురువారం కేసీఆర్‌కు నోటీసులు పంపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు నందినగర్‌లోని నివాసంలో అందుబాటులో ఉండాలని వారు కోరారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారమే ఆఖరు తేదీ కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంలో తాను బిజీగా ఉన్నానని మరోరోజు విచారణ జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు. జూబ్లిహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి శుక్రవారం తాను హాజరు కాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు గులాబీ బాస్.
బ్రేకింగ్ న్యూస్
సిట్ నోటీసులకు బదులిచ్చిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను
విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు – కేసీఆర్ https://t.co/k52L0vK6fD pic.twitter.com/nBxkTap20c
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026
సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం మరో రోజున తనను ఎర్రవల్లిలోని నివాసంలో విచారించాలి. అంతేకాదు ఈ సెక్షన్‌లోని నిబంధనల మేరకు నాకు మీరు ముందస్తు నోటీసులు పంపించి ఆ తర్వాతే విచారించాలి. మరో విషయం 65 ఏళ్లు పైబడిన పురుషులను వారు విచారణ కోసం పోలీస్ స్టేషన్ వెళ్లనవసరం లేదు. పోలీసులే వారి ఇంటివద్దకు వెళ్లి విచారణ చేపట్టాలి. ఇకపై నాకు పంపాల్సిన నోటీసులను నేను నివసిస్తున్న ప్రాంతానికి అంటే.. ఎర్రవల్లికే పంపాలి. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.