TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులేస్తున్నది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించిన సిట్.. సోమవారం చైర్మన్ జనార్దన్‌రెడ్డి నుంచి వివరాలు సేకరించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/గండీడ్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని సోమవారం సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ప్రశ్నించింది. కమిషన్ విధి విధానాలు, పేపర్ లీకేజీ అంశాలపై మూడున్నర గంటలపాటు వివరాలు సేకరించింది. పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ పీఏ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరి నుంచి గ్రూప్-1 పేపర్ కమిషన్ సభ్యుడు లింగారెడ్డి పీఏ రమేశ్‌కు వెళ్లింది. దీంతో కార్యదర్శి, కమిషన్ సభ్యుడిని సిట్ విచారించి, పలు విషయాలను సేకరించింది.
ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సిట్ చీఫ్, నగర అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా కార్యాలయంలో ఎన్ని విభాగాలున్నాయనే విషయాన్ని ఆరా తీశారు. టీఎస్పీఎస్సీ ర్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డికి సంబంధించి ఆరోపణలున్నాయా? మీ దృష్టికి వచ్చాయా? అనే విషయాలను తెలుసుకున్నారు. పేపర్లకు శంకరలక్ష్మి బాధ్యతగా ఉంటారని మీరు భావించారా? గతంలో ఇలాంటి సమస్యలు కార్యాలయంలో అంతర్గతంగా చర్చించడం జరిగిందా అనే విషయాలను అడిగినట్టు తెలిసింది. సిట్ ప్రశ్నలకు సవివరంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సమాధానాలు చెప్పినట్టు సమాచారం. పేపర్ లీకేజీ ఘటనపై సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని సిట్‌కు చెప్పినట్టు తెలిసింది.
లీక్ అయిన ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసి పరీక్ష రాసిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ ఈ ఇద్దరిని రేణుక భర్త ఢాక్యా, ఆమె సోదరుడు రాజేశ్వర్‌కు పరిచయం చేసిన కాంట్రాక్టర్ తిరుపతయ్యలను మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఉపాధి హామీ పథకంలో టీఏగా పనిచేస్తున్న తిరుపతయ్యను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చినట్టు ఏపీవో హరిశ్చంద్రుడు తెలిపారు.