TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్‌లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రధాన నిందితులతో సంబంధాలు కొనసాగించి, లీకైన గ్రూప్-1 పేపర్‌తో పరీక్ష రాసిన వారి ఆధారాలు నిర్ధారించిన సిట్.. సురేశ్‌తోపాటు మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నది. ఆ ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. గ్రూప్-1లో వంద మార్కులకుపైగా వచ్చిన దాదాపు 120 మందిని గుర్తించిన సిట్.. వారిని విచారిస్తున్నది. ఇందులో 20 మంది టీఎస్ఎపీస్సీలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. వారిలో 10 మంది క్వాలిఫై కాగా, ముగ్గురికి 120 కంటే ఎక్కువగా మార్కులు వచ్చాయి.
వీరు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, మరొకరు పేపర్ కస్టోడియన్‌కు పరిచయస్థులని పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురికి గ్రూప్-1 పేపర్ లీక్ చేసి ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించి, వారిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ ఘటనలో సాంకేతిక అంశాల ఆధారంగా అనుమానితులను గుర్తిస్తూ వారిని విచారిస్తున్న సిట్.. ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌కు స్నేహితుడైన సురేశ్‌ను బుధవారం విచారించింది. లీకేజీ ఘటనలో అరస్టైన 9 మంది నిందితులను ఐదో రోజు పోలీస్ కస్టడీలో విచారించింది. గ్రూప్-1 పేపర్‌ను లీక్ చేసిన రాజశేఖర్, ప్రవీణ్ దానిని సురేశ్‌కు ఇచ్చినట్టు నిర్ధారించింది. సురేశ్ ఆ పేపర్‌ను మరికొంత మందికి పంపించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
పేపర్ కస్టోడియన్ శంకరలక్ష్మి సిస్టంకు సంబంధించి పాస్వర్డ్ దొంగిలించినట్టు నిందితులు మొదట వెల్లడించారు. దీంతో సిట్ అధికారులు శంకరలక్ష్మి నుంచి వాంగ్మూలం తీసుకోగా, తాను ఎక్కడా పాస్వర్డ్ రాసిపెట్టలేదని ఆమె వెల్లడించారు. చివరకు విచారణలో ఆమె సిస్టంను అడ్మిన్ రాజశేఖర్ హ్యాక్ చేసినట్టు పోలీసులు నిర్ధారించి, ఐటీ యాక్ట్‌ను జోడిస్తున్నారు. కొందరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. నిందితులతో సంబంధాలు ఉండి సెల్ఫోన్లు స్విచ్ఛాప్ చేయడం, నగరం, తమ సొంత ఊళ్లను విడిచిపోయినవారు ఎవరు? అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటున్నారు. వారి వివరాలను సేకరిస్తున్నారు.