కృష్ణ కాలనీ, జనవరి 27: ‘మాది నిరుపేద కుటుంబం. ఉండడానికి ఇల్లు లేదు.. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని కాంగ్రెస్ నాయకులను బతిమాలినా ఇవ్వడంలేదు సార్’ అంటూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కృష్ణకాలనీలోని నిరుపేద కుటుంబానికి చెందిన అకాచెల్లెండ్లు తోకల అనూష, శిరీష బస్తీ బాటలో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో తమ గోడు విన్నవించుకున్నారు. తండ్రి దుర్గయ్య ఆటో డ్రైవర్‌గా, తల్లి శ్రీలత జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ పంపులో కూలి పనిచేస్తున్నారని చెప్పారు. ఇద్దరం ఆడపిల్లలం ఇల్లులేక నివసించడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆడపిల్లల బాధను విని చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర ‘బాధపడకండి.. కాంగ్రెస్‌ది ధనికుల ప్రభుత్వం.
మూడేండ్ల తరువాత మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఇల్లు మంజూరు చేసి, దగ్గరుండి ఇంటిని నిర్మించి ఇస్తా’ అని ఆడబిడ్డలకు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తోకల అనూష, శిరీష బాధ వింటే గుండె తరుకుపోతున్నది. నిధులు, జీవో కాపీలు లేని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న మంత్రులకు ఇలాంటి ఇల్లు లేని నిరుపేదల బాధలు కనపడడం లేదా..? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇండ్లు లేని నిరుపేదల పాపం తాకి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని చెప్పారు.