హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పోడు రైతులకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోడు రైతులు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నారని, ఉన్న ఫళంగా భూములు గుంజుకుంటే వారు ఆగమవుతారని తెలిపారు.
పోడు రైతులపై అటవీ అధికారుల దాష్టీకాలు పెరుగుతున్నాయని, వీటిని ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రైతులు సంఘటితం కావాలని, అధికారుల అరాచకాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సమస్యను పరిషరించే దిశగా ఆలోచించాలని కోరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. మెదక్లో హిందూ యువకుల మీద రాళ్ల దాడి ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.