హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలెందుకు ఓటు వేయాలి?.. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోయినందుకా? మైనార్టీలకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించనందుకా? ఎందుకు ఓటు వేయాలి’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పరిస్థితులు తెచ్చినందుకు ప్రజలు ఓట్లు వేయాలా? అని తూర్పారపట్టారు. హైదరాబాద్ ప్రజలతో పాటు అన్ని రంగాల వారిని మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందని.. ఈ ఉపఎన్నికలో ఆ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి కర్రుకాల్చి ప్రజలు వాత పెట్టాలని ఆయన కోరారు.
బీసీలకు 42శాతం ఇస్తామని ద్రోహం..
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదని దుయ్యబట్టారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలుచేయలేదని మండిపడ్డారు. సంపద సృష్టించడం తెలుసని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు అప్పులంటూ తిరుగుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2.80 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. అదే కేసీఆర్ హయాంలో చేసిన అప్పుతో తెలంగాణ పునర్నిర్మాణం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగ సవరణతో తప్ప బీసీ రిజర్వేషన్లు అమలు కావని స్పష్టం చేసిన సిరికొండ.. రిజర్వేషన్ల కోసం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.
ఏనాడూ ‘జై తెలంగాణ’ అనని సీఎం
కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇండ్లు పీకి పందిరి వేస్తున్నాడని మధూసూదనాచారి మండిపడ్డారు. ఆయన ఏనాడూ జై తెలంగాణ అని అనలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరీక్షలో కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని పేర్కొన్నారు. మం త్రులు వాటాల కోసం కొట్లాడుకోవడం ప్రజలు గమనిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని టాప్‌లో నిలబెట్టారని కొనియాడారు. కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నేతలు రాంనర్సింహగౌడ్, వోడపల్లి మాధవ్ పాల్గొన్నారు.