హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వంపై జరిగిన దాడి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధూసూదనాచారి అభివర్ణించారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్పై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని ఖండించారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడటంలో దారుణంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. తగిన సమయంలో కాంగ్రెస్కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మధూసూదనాచారి హెచ్చరించారు.