హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో విచారణల పేరుతోనే దుష్టపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ది ప్రగల్భాల పాలన, పాపాల పాలన అని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో హౌసింగ్ బోర్డులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినా, ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన విచారణలో అది నిజమని తేలినా, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎవరిపైనా కక్ష సాధించలేదని తెలిపారు. ఇప్పడు కాంగ్రెస్ దుర్మార్గాలను చూసి ప్రజలే తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పాలనా పరంగా బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు, గుర్రానికి.. గాడిదకు ఉన్నంత తేడా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చేతులెత్తేశారని విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను సైతం మోసం చేశారని తెలిపారు. పాలించే సామర్థ్యం కాంగ్రెస్‌కు పార్టీకి లేనేలేదని ధ్వజమెత్తారు. తాడూ బొంగరం లేని సర్కార్ రాష్ట్రంలో కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సింగరేణి బొగ్గు కుంభకోణం టెండర్లలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని, కాంగ్రెస్ అసమర్థత పాలనను దేశం దృష్టికి మరోసారి తీసుకెళ్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తీవ్రనష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్ తన పదేండ్ల పాలనలో సంస్కరించి లాభాల బాట పట్టించారని చెప్పారు. ఫోన్‌ట్యాపింగ్ విషయంలో సిట్ పేరుతో కేటీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారం చూస్తే కార్తీకదీపం, చక్రవాకం వంటి టీవీ సీరియళ్లు, వెబ్‌సిరీస్‌ల మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో పోలీసులకు తప్ప, పాలకులకు సంబంధం ఉండదని, అది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. 14 ఏండ్లు ఉద్యమం చేసి, తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. 10 ఏండ్లు తెలంగాణను అద్భుతంగా అభివృద్ధిపథంలో నడిపించారని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.