వలిగొండ, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మాహుతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. శుక్రవారం శంకర్‌గౌడ్ మృతదేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబానికి సానూభూతి తెలిపేందుకు వెళ్తున్న తనను ఆలేరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని వలిగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశత్వం, అణచివేతకు తన అరెస్టే నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెను నిలువరించక పోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చి ప్రజలు గోస పడుతున్నారని, రేవంత్‌కు పరిపాలన చేతగాక మాట్లాడే ప్రతివేదికపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని, రేవంత్‌కు పా లన చేతగాక రాష్ర్టాన్ని, ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభు త్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల హామీలను నెరవేర్చాలని, ఆత్మాహుతి చేసుకున్న శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్ శంకర్‌గౌడ్ మరో శ్రీకాంతాచారి ; మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్
స్టేషన్ ఘన్పూర్/చిల్పూరు, ఏప్రిల్ 24 : ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నాడు శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకోగా, నేడు ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగం చేశాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం శంకర్‌గౌడ్ మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తు న్న శ్రీనివాస్‌గౌడ్‌ను జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల జాతీయ రహదారిపై పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌ఘన్‌పూర్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. శంకర్‌గౌడ్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆత్మబలిదానం చేసుకోలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ఫిట్స్ అందకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం, సామాన్య ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించిపోయాడని పేర్కొన్నారు. తన ఆత్మబలిదానంతోనైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందని భావించి ప్రాణత్యాగం చేసుకున్నాడని తెలిపారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి కోటిన్నర పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరు ఆత్మబలిదానాలు చేసుకున్నా, అవి ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని స్పష్టంచేశారు.
కార్మికుల రక్తంతో రాజకీయాలా :పల్లా
జనగామ, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికుల రక్తంతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం ఎట్ట్టకేలకు బయటపడిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు బండి సంజయ్‌కు అనుమతించిన ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టే విధానాలతోనే డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మాహుతికి పాల్పడ్డారని, దీనికి రేవంత్ సర్కార్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో డ్రైవర్ శంకర్‌గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న మాజీ హోం మంత్రి సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మధుసూదనాచారి, మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, మాలోత్ కవితను అరెస్టు చేయడమేంటని నిలదీశారు. వెంటనే వారిని విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ‘శంకర్‌గౌడ్‌ది ప్రభుత్వ హత్య.. పోలీస్ జులుం నశించాలి’ అని నినదించారు. సీఎం, మంత్రి పొన్నం వ్యాఖ్యలతోనే శంకర్‌గౌడ్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. బాధిత కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.