శాయంపేట, జనవరి 11: కాంగ్రెస్ దాడులకు ఉద్యమకారులు భయపడరని శాసనమండలిలో బీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. శాయంపేటలో శనివారం రాత్రి సీనియర్ జర్నలిస్టు బాల్నే తిలక్‌బాబు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భువనగిరి బీఆర్ఎస్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
బీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారులని, ఉద్యమంలో ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నామని గుర్తుచేశారు. ప్రధాన ప్రతిక్షపంగా ప్రభుత్వం హామీలు నెరవేర్చేవరకూ తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. ఫార్ములా ఈ-కారు రేసులో ఎక్కడా అవినీతి జరుగలేదని, కేవలం కుట్రతోనే కేటీఆర్‌ను జైలుకు పంపాలని రేవంత్‌రెడ్డి కక్షగట్టారని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.