హనుమకొండ, జూన్ 28: భారత దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పీవీ నరసింహారావు 104వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, పీవీ సోదరుడి కుమారుడు మదన్మోహన్రావుతో కలిసి పీవీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండ బస్టాండ్ జేఎన్ఎస్ స్టేడియంలోని పీవీ విగ్రహానికి పూలమాలలువేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేశ ప్రధానిగా పీవీ ఎనలేని సేవలందించారని కొనియాడారు. సంసరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని వివరించారు. కాంగ్రెస్‌కు వన్నె తెచ్చిన పీవీని ఆ పార్టీ విస్మరించడం శోచనీయమని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వొడితెల మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి వారికి సముచిత గౌరవం ఇచ్చిందని గుర్తుచేశారు. వంగరలో నిర్మిస్తున్న పీవీ స్మారక భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మదన్మోహన్రావు ఆధ్యక్షతన జయంతి వేడుకలు నిర్వహించారు.