హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణ విధానంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్రావుతో కలిసి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సెక్రటేరియట్లో పూర్తి ఆధారాలతో వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మా ట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని హాథీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మా గ్రామాల్లో ప్రభు త్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్క్‌ను స్వాగతిస్తున్నామని, కానీ దీనిద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎస్‌ను కోరినట్టు చెప్పారు.
వెనుకబడ్డ జిల్లా లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఉపా ధి అవకాశాల కల్పనకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. భూ సేకరణకు సంబంధించి చట్ట, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయని స్థానిక రైతులు, బాధితులు సమర్పించిన ఆధారాల ద్వారా వెలుగులోకి వచ్చిందని తెలిపారు. భూ భారతి పోర్టల్ ప్రకారం 2006-2012 మధ్యలో 1,228.66 ఎకరాలను జీఎస్ బయోటెక్ ప్రెవేట్ కంపెనీ కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నదని చెప్పారు. ఆ భూములను కార్పొరేట్ రుణాల కోసం ఎస్బీఎం, యూకో, ఎస్బీఐ, కెనరా బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్టు వివరించారు. రుణాల చెల్లింపులో విఫలం కావడంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. లిక్విడేషన్‌లో భాగంగా బెంగళూరుకు చెందిన ఎక్స్-ఫాక్టర్ కమల్ ట్రేడర్స్ ఈ వేలం ద్వారా కొన్ని ఆస్తులను సొంతం చే సుకున్నట్టు రికార్డుల్లో ఉన్నదని పేర్కొన్నారు.
పూర్తిస్థాయి రెవెన్యూ, న్యాయపరమైన విచారణ చేపట్టకుండా ప్రభుత్వం భూసేకరణ చేసి పరిహారం చెల్లిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. బ్యాంకులు, ఎస్‌సీఎల్‌టీ లిక్విడేటర్లు కోర్టులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడి ప్రాజెక్టు దీర్ఘకాలిక న్యాయ వివాదాల్లో చికుకుపోయే ప్ర మాదం ఉన్నదని తెలిపారు. కార్పొరేట్ లావాదేవీల కారణంగా నిజమైన స్థానిక రైతులే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తాకట్టులో ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడానికి లేదా బదిలీ చేయడానికి ప్రయత్నించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మెగా ఇండస్ట్రియల్ పార్ ఎలాంటి అవినీతికి తావులేకుండా, పూర్తి పారదర్శకతతో అమలు కావడమే తమ ఉద్దేశమని జోగు రామన్న స్పష్టంచేశారు.