ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 27 : ‘కేసీఆర్ సారున్నప్పుడే ఆడపిల్లలను మేనమామోలె సూసిండు.. ఈ రేవంత్‌రెడ్డి ఏం చేసిండు?. అన్నీ మంచిగజేత్తరని చెప్తే నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసమైపోయినం’ అంటూ సిరిసిల్లలో ఓ మహిళ ఆవేదన వెళ్లగక్కింది. ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధులు సిరిసిల్లలో ఆటో డ్రైవర్ల అభిప్రాయాలు తీసుకునే సమయంలో ‘రేవంత్‌రెడ్డి పాలన ఎట్లున్నది?’ అంటూ వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో వేములవాడకు చెందిన వడ్లకొండ అరుణ రేవంత్‌రెడ్డి పేరెత్తగానే అసహనంతో తన బాధను వ్యక్తంచేసింది. ‘కేసీఆర్ ఉన్నప్పుడు ఆడపిల్లలకు మేనమామోలె అన్నీ జేసిండు. కల్యాణలక్ష్మీ ఇచ్చిండు, ఆడపిల్ల పుడితే ఇంత, మొగపిల్లగాడు పుడితే ఇంత అని పైసలిచ్చిండు. అప్పుడు గవుర్మెంటు దవాఖానల గూడ మంచిగజూసేటోళ్లు. నాకు ఒక్కతే బిడ్డ. సిరిసిల్లల సూపర్మార్కెట్ల పనిజేత్తెనే ఎల్లుతది. అప్పుడు లేనోళ్లకు కేసీఆర్ ఎంతన్న మంచిగ జేసిండు. రూ.2 వేల పింఛనిచ్చిండు. నా భర్తకు ఎనిమిదేండ్ల కింద పక్షవాతమచ్చింది. అప్పుడు దవాఖానకు పోతే మంచిగ జూసిండ్రు. ఇప్పుడు పోతే ఎవ్వలు పట్టించుకుంట లేరు. నేను ముందుగాల బీఆర్ఎస్కే ఓటేసిన.
కాంగ్రేసోళ్లు అంతకంటే మంచిగజేత్తరంటే నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసినం. మోసపోయినం. ఎంతైనా కేసీఆర్ సారున్నప్పుడే అన్నీ మంచిగైనయ్. రేవంత్‌రెడ్డి వచ్చి ఏం జేత్తుండు? నాలుగు వేల పింఛనిత్తమని జెప్పిండు.. ఏడిచ్చిండు?’ అంటూ ప్రశ్నిచండం గమనార్హం. ముఖ్యమంత్రి హోదాలో మూడేండ్లకు రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వస్తున్న క్రమంలో ఈ మహిళ మాటలు స్థానికుల్లో కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకత ఏవిధంగా ఉన్నదో బయటపెట్టినట్టయింది.