రాజన్న సిరిసిల్ల, మే 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోనే ఏకైక సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు బలి అవుతున్నది. గత మార్చి 31న లైసెన్స్ గడువు ముగియగా.. టీజీఎన్పీడీసీఎల్ గత ఏప్రిల్ 1 నుంచి తన ఆధీనంలోకి తీసుకుని సిరిసిల్ల సర్కిల్ ఏర్పాటు చేసింది. మంగళవారం సిరిసిల్ల సెస్‌ను టీజీఎన్పీడీఎల్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 17 జిల్లాల్లో ఉన్న టీజీఎన్పీడీసీఎల్ ఇక నుంచి 18వ జిల్లాగా రాజన్నసిరిసిల్ల జిల్లాను చేరుస్తూ పూర్తి కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. సహకార రంగానికి ఇప్పటికే తూట్లు పొడిచిన కాంగ్రెస్ సర్కార్ 56 ఏండ్ల ఘన చరిత్ర ఉన్న సెస్‌ను సైతం ఎన్పీడీసీఎల్లో కలిపింది. సెస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించగా, కేసు కొనసాగుతున్నది. ఇంతలోనే సెస్ విలీనం చేస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేయడంతో సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి.
స్వరాష్ట్రంలో సహకార సంఘాలను కేసీఆర్ సర్కార్ బలోపేతం చేసింది. సిరిసిల్ల సెస్ ఘన చరిత్రను గుర్తించి 2020 మార్చి 31న లైసెన్స్ రెన్యువల్ చేసింది. 2026 మార్చి 31న మళ్లీ రెన్యూవల్ చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. గడువు ముగియగానే టీజీఎన్పీడీసీఎల్ అధికారులు రంగంలోకి దిగి సెస్ కార్యాలయాన్ని అధీనంలోకి తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
1970 నవంబర్ 1న ప్రారంభమైన సిరిసిల్ల సెస్ 56 ఏండ్లుగా మెరుగైన సేవలు అందిస్తున్నది. 1960లో నేషనల్ రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ అసోసియేషన్ (ఎన్ఆర్ఈసీఏ) యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ (యూఎస్ఏఐడీ) సంస్థలు ప్రత్యేకంగా అధ్యయనం చేసి.. రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో దేశంలో ఐదు రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్‌లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసింది. 1970లో తెలంగాణలోని సిరిసిల్లతో పాటు కర్ణాటకలో హూకేరీ, గుజరాత్లో కోడినూర్, ఉత్తరప్రదేశ్‌లో లక్నో, మహారాష్ట్రలో ములపవరలో ఏర్పాటు చేశారు. ఈ ఐదు పైలట్ సహకార సొసైటీల పనితీరును న్యూఢిల్లీ కమిటీ పర్యవేక్షించింది. మథూర్ కమిటీ ఐదు పైలట్ సొసైటీల పనితీరును పర్యవేక్షించి మరిన్ని రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. వీటి ఫలితంతో దేశంలో మరో 100 రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసింది. దీంతో 9 రూరల్ కో ఆపరేటివ్ సొసైటీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. దేశంలో 30 రూరల్ కో ఆపరేటివ్ సొసైటీలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సిరిసిల్ల సెస్ ఏకైక సొసైటీ కావడం విశేషం. సెస్ అవిర్భావం నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఏ నేత కూడా చైర్మన్‌గా ఎన్నిక కాకపోవడం గమనార్హం.
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల చరిత్రగల సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ(సెస్)ను ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎన్పీడీసీఎల్)లో విలీనానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. సెస్‌ను రద్దు చేయాలని, సంస్థను ఉత్తర డిస్కమ్‌లో విలీనం చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇంతకాలం ముందడుగు పడలేదు. నాడు బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 2026 ప్రారంభంలో సెస్ స్వాధీనానికి ఉత్తర డిస్కమ్ చర్యలు చేపట్టింది. సెస్ విలీనంపై ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణ చేసిన ఈఆర్సీ మొత్తంగా సెస్ విలీనానికి ఆమోదం తెలిపింది. ఉత్తర డిస్కమ్ పరిధిలో ఇంతకాలం 17 జిల్లాలు ఉండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా చేరడంతో జిల్లాల సంఖ్య 18కి చేరింది.
సెస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారు. లైసెన్స్ ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్కు అప్పగించడం సరైందికాదు. సెస్ సభ్యులతో ఎన్నుకున్న పాలకవర్గాన్ని విస్మరించారు. పాలకవర్గ సహకారంతో ఈఆర్ఎసీ, ఎన్‌పీడీసీఎల్‌పై హైకోర్టులో కేసువేయగా నడుస్తున్నది. ఇంతలో ఈఆర్సీ సెస్‌ను ఎన్పీడీసీఎల్కు అప్పగించారు. దీనిపై న్యాయ పోరాటం కొనసాగిస్తాం. సెస్‌ను కాపాడుకోవడానికి అందరి సహకారంతో పోరాటం చేస్తాం.