హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.88 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల అందజేత కార్యక్రమం 85 శాతం పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. శనివారం సాయంత్రం సీఈవో కార్యాలయం విడుదల చేసిన అధికారిక నివేదికల ప్రకారం.. ఓటర్లకు ఎన్యూమరేషన్ల ఫారాల పంపిణీలో రాజన్న సిరిసిల్ల జిల్లా టాప్లో ఉండగా, మేడ్చల్ మలాజిగిరి జిల్లా చివర నిలిచింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా 98.69 శాతం ఈఎఫ్ పంపిణీతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలువగా, నిర్మల్ (98.02శాతం), కరీంనగర్ (97.75శాతం), జగిత్యాల (96.47శాతం), ఆదిలాబాద్ (96.41శాతం), కుమ్రంభీం ఆసిఫాబాద్ (96.31శాతం), సిద్దిపేట (96.28శాతం) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధిక ఓటర్లు ఉన్న మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 55.63 శాతం మాత్రమే ఎన్యుమేషన్ ఫారాల పంపిణీ జరిగింది.
డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నది. పంపిణీ చేసిన ఫారాలను ఆన్లైన్లో డిజిటలైజ్ చేసే ప్రక్రియలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా 18.25 శాతంతో ముందంజలో ఉన్నది. నిజామాబాద్ జిల్లా 1,28,018 (8.89శాతం) ఫారాలను డిజిటలైజ్ చేసింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా అత్యల్పంగా 0.72శాతం డిజిటలైజేషన్తో వెనుకబడి ఉన్నది. మిగిలిన ఓటర్లకు కూడా వేగంగా ఫారాలు అందజేసి, వంద శాతం పంపిణీ పూర్తిచేయడంతోపాటు డిజిటలైజేషన్ వేగాన్ని పెంచాలని సీఈవో కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు పారదర్శకంగా పూర్తిచేయడమే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ముఖ్య ఉద్దేశమని స్పష్టంచేసింది.
