కరీంనగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువరించింది. సందీప్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న దాదాపు పద్నాలుగు నెలలలో మొదటి నుంచీ వివాదాస్పందగా వ్యహరించారని విమర్శలను ఎదుర్కొన్నారు. ముందుగా కలెక్టర్ తమను లక్ష్యంగా చేసుకొని కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత అధికార పార్టీ నేతలకు కూడా సెగ తగలింది.
ఈ పరిస్థితుల్లో కలెక్టర్ వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతలు.. ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం.. సీఎం దృష్టికి తీసుకెళ్లడం వంటి పరిణామాల క్రమంలో కలెక్టర్ బదిలీ జరిగింది. కలెక్టర్ వ్యవహారశైలి బాగా లేదని, నిత్యం వివాదాలు సృష్టిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ.. పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ నేతలు ఉన్నతాధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా అధికార పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు బదిలీ జరిగిందని చర్చ నడుస్తున్నది.
రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా 2024 జూన్ 16న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు చాలా వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు ప్రొటోకాల్ పాటించలేదని.. విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకాల్సిన కలెక్టర్ నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ డెయిరీకి లైసెన్స్ లేదంటూ సీజ్ చేయించారు. దీంతో పాడి రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పాలు రోడ్డుపై పారబోసి జిల్లా వ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు.
ఈ వివాదం చినికి చినికి పెద్దది కావడం.. ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడటంతో లాక్ తీశారు. నిర్వాసితురాలు పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించినందుకు, తప్పుడు ఆధారాలతో కోర్టును తప్పుదోవ పట్టించావంటూ ఆమెపై పోలీసు కేసు పెట్టించారు. ఆమె తిరిగి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు గంటలు నిల్చుండబెట్టి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా కథనాలు వెలువడ్డాయి. వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో నిర్వాసితులకు సరైన పరిహారం నిర్ణయించకుండానే నివాసాలు, దుకాణాలు కూల్చివేయడంపై బాధిత కుటుంబాలు మనోవేదనకు గురయ్యాయి. కలెక్టర్ తీరుపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.
రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేశారు. ప్రతిపక్ష పార్టీ అయిన.. బీఆర్ఎస్ నాయకులను, పార్టీ శ్రేణులను టార్గెట్‌చేసి కేసులు పెట్టించారని విమర్శలు ఎదుర్కొన్నారు. న్యాయబద్ధంగా భూమి కొనుగోలు చేసిన అనేక మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి జైలు పాలు చేశారని, అధికారపార్టీ నేతల ఆదేశాలతోనే ఇలా చేశారని విమర్శలు వచ్చాయి.
సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ ఫొటో పెట్టుకున్న ఓ చిరువ్యాపారి టీస్టాల్‌ను కలెక్టర్ తొలగించడం పెనుదుమారం సృష్టించింది. స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేశా రు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించడంతో బాధితుడు కుటుంబంతో కలిసి భోరున విలపించడం తీవ్ర చర్చనీయాంశమైం ది. కలెక్టర్ తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. కేటీఆర్ స్పందించి, కొత్తగా టీస్టాల్ పెట్టించి, దగ్గరుండి ఓపెన్ చేశారు.
కలెక్టర్ సందీప్కుమార్ఝాను ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆయన బాధితులు శ నివారం సంబురాలు జరుపుకున్నారు. బదిలీ వార్త వినగానే పటాకులు కాల్చి, ఆ లయాల్లో కొబ్బరికాయలు కొట్టారు. స్వీ ట్లు పంచిపెట్టి సంతోషాన్ని వ్యక్తంచేశారు. రగుడు చౌరస్తాలోని కలెక్టరేట్ వద్ద పటాకులు కాలుస్తున్న బాధితులు శ్రీనివాస్, అగ్గి రాములు, అబ్బాడి అనిల్ మరికొంత మందిని పోలీసులు అడ్డుకున్నారు. దీం తో బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ బదిలీతో ప్రజలు సంబురాలు జరుపుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.