హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ ): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ ) పరిధిలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)-2026 ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియకు సంబంధించి 2026 అక్టోబర్ ఒకటిన తుది జాబితా ప్రకటించనుండగా, ఈ సమయానికి 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మే 26 నాటికి 22,09,647 మంది(46.65 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తవగా, మిగిలిన 25,27,022 మంది ఆన్మ్యాప్డ్ ఓటర్ల ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తిచేయనున్నట్టు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకానికి రాజకీయ పార్టీల తరఫున బీఎల్ఏలను నియమించినట్టు చెప్పారు. జిల్లాలోని 4,062 పోలింగ్ కేంద్రాలకుగాను వివిధ పార్టీల నుంచి మొత్తం 10,901 మంది బీఎల్ఏల నియామకం పూర్తయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 3,601 కేంద్రాల్లో 88.65 శాతం, బీజేపీ 2,941 కేంద్రాల్లో 72.40 శాతం, ఎంఐఎం 2,371 కేంద్రాల్లో 58.37 శాతం, బీఅర్ఎ స్ 1,988 కేంద్రాల్లో 48.94 శాతం నియామకం పూర్తిచేసినట్టు కర్ణన్ వివరించారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల గణంకాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. జూన్ 10, 2026 నాటికి ఉన్న వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 47,36,669గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పురుషులు 23,99,880, మహిళలు 23,36,448, థర్డ్ జెండర్ 341, మొత్తం పోలింగ్ స్టేషన్లు 4,062కాగా, 1,684 చోట్ల లోకేషన్లు ఉన్నట్టు అధికారులు వివరించారు.
ఈ నెల 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. అప్పటికీ వీలుకాకపోతే నోటీసు స్లిప్ ఇస్తారు. ఓటర్లు తమ ఫారాలను నింపి నేరుగా బీఎల్వోకు ఇవ్వవచ్చు. లేదా WWW.VOTERS.ECI.GOV.IN వెబ్సైట్ లేదా ECP APP ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు. కొత్త ఓటర్లు ఫారం-6, మార్పులకు ఫారం-8 ఉపయోగించాలని సూచించారు.
బీఎల్వోకు ఫారాలు అందజేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదు కాపీని ఓటరు అడిగి తీసుకోవాలి. సర్వే పూర్తయిన ఇండ్లకు ఎన్యుమరేషన్ కంప్లీట్ అనే స్టిక్కర్ అంటిస్తారు. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు కలిగి ఉంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్-31 ప్రకారం శిక్షార్హులవుతారు. ఓటర్ల సందేహాల నివృత్తికి 15 ఈఆర్వో కార్యాలయాల్లో, డీఈవో ఆఫీస్, జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు.