హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) కార్యక్రమం ప్రారంభమైనది. ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) గురువారం విడుదల చేశారు. ఓటరు జాబితా సవరణకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 21 ప్రకారం, 2026 అక్టోబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణతోపాటు ఇంటింటి సర్వే నిర్వహించి పారదర్శకమైన జాబితాను రూపొందించడమే లక్ష్యం ఐదు నెలల సమగ్ర షెడ్యూల్ ఖరారు చేశారు.
జూన్ 15 నుంచి జూలై 24 వరకు ‘సర్’ ప్రక్రియకు అవసరమైన సన్నాహకాలు పూర్తిచేయనున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా, స్థానిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల పరిధిని, స్థానాలను అధికారులు ఈ దశలో సర్దుబాటు చేస్తారు. సిబ్బందికి శిక్షణ, ఓటరు జాబితాలు, ఇతర ముద్రణలు సిద్ధం చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో) క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ప్రతి ఇంటినీ సందర్శించి వివరాలు సేకరిస్తారు. అధికారులు ఇండ్లకు వచ్చినప్పుడు ముందే నింపబడిన ఫారాలను అందజేస్తారు.
ఒకవేళ ఇంటికి తాళం వేసిఉంటే, బీఎల్వోలు కనీసం మూడుసార్లు సందర్శిస్తారు. ఓటర్లు తమ నమోదు ఫారాలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని సమర్పించే అవకాశం కూడా కల్పించారు. జూలై 24వ తేదీలోపు పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ‘సర్’ ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన దశగా చెప్తున్నారు. రాష్ట్రంలోని 3,39,20,705 మంది ఓటర్ల వివరాలను ధ్రువీకరించడానికి 35,985 మంది బీఎల్వోలను నియమించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూసేందుకు రాజకీయ పార్టీల తరఫున 25,886 మంది బూత్‌స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ) అధికారులకు సహకరిస్తారు.
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత జాబితాలో ఓటుహక్కు లేనివాళ్లు, కొత్తగా ఓటు నమోదు కోసం అప్పీల్ చేసుకోవడానికి నెలరోజుల సమయం కల్పించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిషా రం, ఫిర్యాదులు ఇచ్చేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో నోటీసుల జారీ, విచారణ, ధ్రువీకరణ, నమోదు ఫారాలపై నిర్ణయం, క్లెయిమ్స్లు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు నిర్వహిస్తారు. కొత్తగా ఓటరుగా పేరు నమోదుకు ఫారమ్-6, వివరాల సవరణ లేదా నివాస మార్పుకోసం ఫారమ్-8 సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28వరకు అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. తుది జాబితాలో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉన్నా లేదా నమోదులో ఇబ్బందులు ఎదురైనా ఓటర్లు బీఎల్వోల సహాయం తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఒకవేళ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే, జిల్లా మెజిస్ట్రేట్‌కు లేదా సీఈవోకు అప్పీల్ చేసుకొనే అవకాశం చట్టప్రకారం ఉన్నట్టు సీఈవో వెల్లడించారు.
‘సర్’ మూడోదశ తెలంగాణసహా 16 రాష్ర్టాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాలన్నీ ఈ మూడో దశతో కవర్ కానున్నాయి. 16 రాష్ర్టాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 36.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 3.94 లక్షల మంది బీఎల్వోలను తాము నియమించామని, 3.42 లక్షల మంది బీఎల్వోలను వివిధ పార్టీలు నియమించినట్టు ఈసీఐ డిప్యూటీ డైరెక్టర్ పీ పవన్ తెలిపారు. ‘సర్’ ప్రక్రియను ఈసీఐ తొలుత ప్రయోగాత్మకంగా బీహార్‌లో జూన్ 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు నిర్వహించింది. రెండోదశ ‘సర్’ ప్రక్రియను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2025 అక్టోబర్ 27న ప్రారంభించి ఇటీవలే ముగించింది. ప్రస్తుతం మూడోదశపై ఈసీఐ దృష్టి పెట్టింది. జనాభా గణన, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ మూడో దశ షెడ్యూల్‌ను రూపొందించినట్టు ఈసీఐ తెలిపింది.
