కారేపల్లి, ఆగస్టు 15 : మారుమూల గ్రామీణ ప్రాంత యువత భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడమే మిషన్ వాక్ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యమని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, వైద్యుడు బాదావత్ రవి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సింగరేణి మండలంలో గల తన స్వగ్రామమైన కొత్తతండాలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు మిషన్ వాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మిషన్ వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాదావత్ రవి మాట్లాడుతూ.. యువతకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం చూపాలనే సంకల్పంతో సొంత గ్రామంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎంతోమంది గ్రామీణ యువతలో ప్రతిభ, ఉత్సాహం ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మార్గదర్శకత్వం లేక ఆర్థిక పరిస్థితుల కారణంగా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత ఉద్యోగ, ఉపాధిల కొరకు పట్టణాల వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తగ్గాలనీ నైపుణ్యం ఉంటే అవకాశాలు మన దగ్గరకే రావాలనే ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. మిషన్ వాక్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ బాధితులు, దివ్యాంగులు, పేద కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ వాక్ సభ్యులు, ఆర్మీ సోల్జర్ బానోత్ దశరథ్, సురేష్, నరేష్, షరీఫ్, సాయి, అజయ్, పవన్, ప్రసాద్, షేర్ ఖాన్, హాజ్రా, పీకే సింగ్, నితిన్, రంగ, భద్రు, దేవా, సతీష్, రాయల శ్రీను, పవన్, ప్రసాద్, శ్యామ్ పాల్గొన్నారు.