NALSAR Row : నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. తమను ఎన్రోల్ చేసుకోకుండా నిషేధం విధించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రాపై నల్సార్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనన్ కుమార్ మిశ్రా తమకు క్షమాపణలు చెప్పాలని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్టూడెంట్ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. 2026లో నల్సార్ యూనివర్సిటీ పరిధిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేసేందుకు యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సీజేఐ సూర్యకాంత్‌ను యూనివర్సిటీ పాలకవర్గం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.
అయితే, ఈ నిర్ణయాన్ని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకించారు. ఇటీవల యువతపై సీజేఐ చేసిన వ్యాఖ్యలు, నీట్ విద్యార్థులపై దాడి విషయంలో ఆయన వ్యవహరించిన తీరును నిరసిస్తూ నల్సార్ విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి పిలవకూడదని కోరుతూ వందలాది మంది విద్యార్థులు సంతకాలు చేశారు. దీంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సీజేఐకి వ్యతిరేకంగా నల్సార్ విద్యార్థులు తీసుకున్న నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీవ్రంగా ఖండించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026, నల్సార్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకోకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలిచ్చారు.
బార్ కౌన్సిల్ సభ్యులెవరూ ఆ విద్యార్థుల్ని చేర్చుకోకూడదని మనన్ కుమార్ ఆదేశించారు. అయితే, ఆయన ఆదేశాలపై విద్యార్థి వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని లా విద్యార్థులు, నిపుణులు అన్నారు. పైగా ఆయన నిర్ణయాన్ని సీజేఐ సూర్యకాంత్ కూడా తప్పుబట్టారు. తనపై నిరసన తెలియజేసే హక్కు విద్యార్థులకు ఉందన్నారు. బార్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాంటి విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని వ్యాఖ్యానించారు. ఇటు విద్యార్థులు, న్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత.. అటు సీజేఐ నుంచి కూడా మద్దతు లేకపోవడంతో గంటల వ్యవధిలోనే మనన్ కుమార్ మిశ్రా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
విద్యార్థులపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పారు. అయితే, తమపై నిషేధం విధించడాన్ని నల్సార్ విద్యార్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు నిరసన తెలియజేసే హక్కు ఉందని, ఆయన నిర్ణయం రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధమని, అందువల్ల ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.