హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియ ద్వారా పౌరుల జీవించే హకును కేంద్రప్రభుత్వం కాలరాస్తున్నదని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సర్’పై సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం మగ్దూంభవన్‌లో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన పద్ధతి అని, కానీ ప్రస్తుతం ఓట్లు తొలగించే కార్యక్రమంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాన్ని అన్ని పార్టీలు కలిసికట్టుగా ఎదురోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఓటర్ల వివరాలు నిర్ధారణ కాలేదంటూ పత్రికల్లో వస్తున్న వార్తలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన ప్రతిఒకరి ఓటుహకును కాపాడేందుకు ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. ప్రజా ఉద్యమాలతోనే కేంద్ర ప్రభుత్వానికి అడ్డుకట్ట సాధ్యమని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఓటు హకు కోల్పోవడం అంటే కేవలం ఓటు వేసే అవకాశం పోవడం మాత్రమే కాదని, భవిష్యత్తులో పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించారు.