హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను సులభతరం చేయడం, పారదర్శకత పాటించడం, ఒకే వేదికపై డిజిటల్ సేవలు తీసుకురావడమే ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ’ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు స్పష్టంచేశారు. ఈ కార్డు ద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.
శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే కార్డులో పొందుపరిచేలా ‘యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు’ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
‘ఒకే కార్డు- అన్ని సంక్షేమ పథకాలు’ అనే విధానంతో కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనిపై 10 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ డాటా, హెల్త్ ప్రొఫైల్ వంటి సమాచారం కూడా ఈ కార్డుకు అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.