ముంబై, ఆగస్టు 18: టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఊహించినట్టుగానే వాయిదా పడింది. కోరమ్ లేక ఏజీఎం వాయిదా పడ్డట్టు మంగళవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే టాటా గ్రూప్ సంస్థలకు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న టాటా సన్స్ చరిత్రలోనే ఏజీఎం ఇలా వాయిదా పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ), సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ)లు తమ ప్రతినిధిని నామినేట్ చేయలేకపోవడంతోనే సమావేశం వాయిదా పడాల్సి వచ్చింది.
టాటా సన్స్‌లో ఎస్‌ఆర్‌టీటీ, ఎస్డీటీటీలకు 51 శాతానికి పైగానే వాటా ఉన్నది. మహారాష్ట్ర చారిటీ కమిషనర్.. ఎలాంటి కీలక నిర్ణయాలుగానీ సమావేశాలుగానీ నిర్ణయించవద్దని ఎస్ఆర్టీటీని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం జరుగాల్సిన ఏజీఎంకు ఎస్‌ఆర్‌టీటీ తమ ప్రతినిధిని పంపలేకపోయింది.
కాగా, తదుపరి ఏజీఎం ఎప్పుడు? అన్న వివరాలేవీ టాటా సన్స్ ఇంకా తెలియపర్చలేదు. అయితే టాటా గ్రూప్, టాటా సన్స్లకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎన్ చంద్రశేఖరన్.. తన ఉద్యోగ పదవి నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకోవడంతో ఈ ఏజీఎం కీలకంగా మారింది. ఇందులో తదుపరి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నిర్ణయాలు జరుగాల్సి ఉన్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరితో చంద్రశేఖరన్ పదవీ కాలం ముగుస్తున్నది విదితమే.