వనపర్తి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా పాలకులకు తొత్తులా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఆరోపించారు. మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు.
మహిళలకు రూ.2,500, ఆసరా పింఛన్లు రూ.4 వేలు, కల్యాణలక్ష్మిలో తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, రైతుబంధు, వరికి బోనస్, రుణమాఫీలాంటి హామీలను కాంగ్రెస్ పూర్తిగా బొంద పెట్టిందని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనువుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎంగా మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇందుకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు నిదర్శనంగా ఉండబోతుందని అన్నారు.