హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉంటే, వారికి బీఆర్ఎస్ ధైర్యం చెప్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీ గురువారం వరంగల్ జిల్లా తలారిగూడ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నదని, అయితే, పోలీసులు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ అధ్యయనానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని, అనుమతి ఇవ్వనంత మాత్రాన అధ్యయనం ఆగిపోదని స్పష్టంచేశారు. పోలీస్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ పాలన నడుస్తున్నదని విమర్శించారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన అధ్యయన కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జోగు రామన్న, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నాయకులు దేవీప్రసాద్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, రాజవరప్రసాద్, కిశోర్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. గాలి మాటలు, ఢిల్లీకి మూటలు తప్ప 14 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పాలన రోజుకో గండంలా మారిందని మండిపడ్డారు.
పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేక రైతులు తల్లడిల్లుతున్నారని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అచ్చంపేట, గద్వాల, మెదక్ ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారని, పత్తి రైతులు రోడ్డెకి అలిసిపోయారని వాపోయారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకాక, రుణమాఫీ జరగక, రైతుబంధు రాక, బోనస్ లేక, మద్దతు ధర అందక, కరెంటురాక, సాగునీళ్లు అందక రైతులు ధైర్యం కోల్పోయి నిరాశ, నిసృ్పహలకు గురవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కలిసి ఓదార్చి కొంత సహాయం అందించినట్టు తెలిపారు. ఢిల్లీకి, విదేశాలకు తిరిగే సీఎంకు, హెలికాప్టర్లలో తిరిగే మంత్రులకు రైతులను పరామర్శించే తీరిక లేదా? అని ప్రశ్నించారు.
గాంధీజీ వారసులమని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ నాయకులు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. అబద్ధాలు చెప్పొద్దని, సత్యమే పలకాలని గాంధీజీ బోధించారు. కానీ, రోజూ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులు ఎలా అవుతారు.
– నిరంజన్‌రెడ్డి
జనవరి 26న రైతుభరోసా జమ చేస్తామని తొలుత చెప్పి, 15 నిమిషాల్లోనే మార్చి 31 వరకు వేస్తామంటూ మాట మార్చారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 12,995 గ్రామాలు, 70 లక్షల రైతులు ఉంటే, 561 గ్రామాల్లోని 4.42 లక్షల మంది (6%)కే రైతుభరోసా వేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం మాట్లాడకుండా స్పీకర్‌తో ఎందుకు మాట్లాడిస్తున్నరని ప్రశ్నించారు. 40 లక్షల మంది రైతు కూలీలు ఉంటే 20 వేల మందికే ఆత్మీయ రైతుభరోసా ఇచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలన ‘ఊరికి ఒక కోడి ఇంటికి ఒక రెక అన్నట్టుగా ఉన్నది’ అని ఎద్దేవాచేశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గనిపించడం లేదా? రైతులకు ధైర్యం ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదు. ఢిల్లీకి, విదేశాలకు తిరిగే సీఎంకు, హెలికాప్టర్లలో తిరిగే మంత్రులకు రైతులను పరామర్శించే తీరిక లేదా?
‘కేసీఆర్ హయాంలో రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఇచ్చాం. 1.15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల రైతుబీమా చెల్లించాం. 28,275 కోట్ల రుణమాఫీ చేశాం. రూ.65 వేల కోట్ల మేర కరెంటు రాయితీ ఇచ్చాం. ప్రాజెక్టులకు 2.37 లక్షల కోట్లు .. మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.4,08,900 కోట్లు ఖర్చు చేశాం’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తలదన్నేలా చేశారని, 40 వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్ పామ్ సాగును 2 లక్షల ఎకరాలకు దాటించారని తెలిపారు. రైతులకు ధైర్యం ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. కేవలం రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ నాయకులు.. గత ప్రభుత్వాలు ఏమీ ఇవ్వనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని అంటున్నారని, కానీ తెలంగాణలోని సబ్బండవర్ణాలు నేడు కేసీఆర్ పాలన కోరుకుంటున్నాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయం.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగలా మారిందని విమర్శించారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారని, ఆ స్ఫూర్తిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసాగించడం లేదని మండిపడ్డారు.