వనపర్తి టౌన్, డిసెంబర్ 22 : భా వితరాలకు ఉన్నత విద్యను అందించి వనపర్తి జిల్లాను విద్యారంగంలో అగ్రభాగాన నిలిపినట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మాట్లాడుతూ తన మామయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
వనపర్తి నియోజకవర్గాన్ని అగ్రభాగంలో నిలపడానికి చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పోటీపడి పనిచేశానని చెప్పారు. వనపర్తికి బీసీ డిగ్రీ గురుకుల కళాశాల మంజూరైతే అప్పటి మంత్రిగా అగ్రికల్చర్ కళాశాలను తీసుకువచ్చి, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, ఫిషరీష్ కళాశాలల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశానని గుర్తుచేశారు. అనంతరం ముఖ్య అతిథులతో కలిసి 50 వసంతాల సావనీర్‌ను ఆవిష్కరించారు.