కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండేళ్ల సమయం పట్టిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే ఎప్పుడో ఈ ఎన్నికలను పెట్టేవారని తెలిపారు. హామీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఎన్నికలు పెట్టేదని పేర్కొన్నారు. హామీలు అమలు సాధ్యం కాదన్న విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 700 మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురుకులాల్లో చదివే 60 మంది విద్యార్థులు మృతిచెందారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేంద్ర ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించడం లేదని విమర్శించారు. యాసంగి మొదలైందని.. ఈసారి రైతుబంధు ఇస్తారో ఇవ్వరో కూడా చెప్పడం లేదని అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకటే సీజన్లో రైతుబంధు వేసిందని అన్నారు.
ఎన్నికల విధుల్లో సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవమయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని తొలి విడత ఫలితాలు చాటిచెప్పాయని అన్నారు. రెండు, మూడో విడతల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు.