వనపర్తి, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్‌లు తెగడం అత్యంత సాధారణమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం జూరాల పరిశీలనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ పర్యటన కంటితుడుపు చర్యగా సాగిందని విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో స్పిల్‌వే, తెగిపోయిన గేట్ల ఐరన్ రోప్‌లు పరిశీలించకుండా ఉత్తమ్ పర్యటన సాగడంపై నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, గేట్ల రోప్‌లు తెగడం అత్యంత సాధారణమని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు. అలాంటప్పుడు హడావుడిగా మంత్రి ప్రాజెక్టు వద్దకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.