భద్రాచలం/మంచిర్యాల, ఫిబ్రవరి 15: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కూటమి అభ్యర్థుల శిబిరంపై పోలీసులతో కలిసి దాడి చేసేందుకు కాంగ్రెస్ గూండాలు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకొన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే అప్రమత్తమై వారిని భద్రాచలం నుంచి చెన్నూరులోని తన నివాసానికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ కూటమిగా పోటీచేశాయి. కాంగ్రెస్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో ఆ కూటమి అభ్యర్థులతో కలిసి బాల్క సుమన్ శనివారమే భద్రాచలం పట్టణానికి చేరుకొన్నారు. శనివారం ఓ హోటల్లోని శిబిరంలో అభ్యర్థులతో కలిసి బస చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ విజేతలను ఆదివారం అదే భద్రాచలంలోని మరో హోటల్లోని శిబిరంలోకి మార్చారు. అయినా పసిగట్టిన కాంగ్రెస్ గూండాలు స్థానిక పోలీసుల సాయంతో బీఆర్ఎస్, సీపీఐ కూటమి విజేతల శిబిరంపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకొన్న బాల్క సుమన్.. వెంటనే వారిని ప్రత్యేక వాహనాల్లో ఆదివారం అర్ధరాత్రికి చెన్నూరులోని తన నివాసానికి చేరుకొన్నారు.
చెన్నూరులో ప్రజాస్వామ్యం ఖూనీ: బాల్క సుమన్
చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం రాత్రి చెన్నూరులోని 63వ జా తీయ రహదారిపై మీడియాతో మాట్లాడారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ కూటమికి చెందిన 14మంది కౌన్సిలర్ల శిబిరంపై కాంగ్రెస్ పార్టీ దాడికి యత్నించిందని ఆరోపించారు. ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని, ఎలాగైనా మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకొనేందుకు అధికార కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.