హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ) : ‘ఉమ్మడి పాలనలో అడుగడుగునా దగాపడ్డ తెలంగాణ బిడ్డల గొంతు తడిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకుర్పాణ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించి ఇక్కడి ప్రజల ఆకలి తీర్చారు. కానీ, ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కమిషన్ పేరిట అనవసర రాద్ధాంతం చేస్తున్నరు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే మూడు ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారానికి ఒడిగట్టారు’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. నాగర్జునసాగర్ సైట్ మార్చి తెలంగాణ ప్రజల గొంతు కోసిన వారే ఇప్పుడు గొంతు చించుకొని రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని పండబెట్టి బనకచర్ల రూపంలో గోదావరిని తరలించుకెళ్లేందుకు ఎత్తులు వేస్తున్న ఆంధ్రా‘బాబు’లకు హారతులు పడుతున్నారని మండిపడ్డారు. 665 పేజీలున్న జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను 60 పేజీలకు కుదించి దుర్మార్గాపు ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు.
సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఘోష్ కమిషన్ నివేదిక పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు వల్లెవేశారని దుయ్యబట్టారు. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్, హరీశ్‌రావు అనేక ప్రయత్నాలు చేసి సీడబ్ల్యూసీ, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం నివేదిక మేరకే మేడిగడ్డకు మార్చారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ నాయకులు ఇదేదో పెద్ద చారిత్రక తప్పిదంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నాడు ఏలేశ్వరం దగ్గర నిర్మించాల్సిన నాగర్జునసాగర్ సైట్‌ను నందికొండకు ఎందుకు మార్చారు? ఆంధ్రా ప్రాంతానికి మేలు చేస్తూ, తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఎందుకు మిన్నకుండిపోయారు? అని ప్రశ్నించారు. నాడు చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సైట్ మార్పు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకుల మూలంగానే తెలంగాణ ప్రాంతం కరువు, కాటకాలకు నిలయంగా మారిందని విమర్శించారు. తెలంగాణ గొంతు కోసిన పార్టీకి కాళేశ్వరం నిర్మించి నీళ్ల గోస తీర్చిన కేసీఆర్‌పై విమర్శలు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, బానిస మనస్తతత్వం కలిగిన కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరంపై విషం చిమ్ముతూ కేసీఆర్‌పై బురదజల్లుతున్నారని నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. కేంద్రానికి ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విరుచుకుపడ్డారు. మిగులు జలాల ముసుగులో బనకచర్లను నిర్మించి గోదావరిని చెరబట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రాలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించిన చంద్రబాబు.. అన్ని అనుమతులున్న కాళేశ్వరంపై విషం చిమ్ముతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పచ్చబడ్డ తెలంగాణను చూసి ఓర్వలేక కేసీఆర్ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరిస్తున్నరు. రాజకీయ లబ్ధి కోసం, రేవంత్‌రెడ్డి తన గురువుకు మేలు చేసేందుకు ఆరాటపడుతున్నరు. అందుకే మీడియాలోని ఒక వర్గం, కొందరు నేతలు కాళేశ్వరంపై కక్ష సాధిస్తున్నరు. నీళ్లతో కళకళలాడుతున్న తెలంగాణను చూసి కండ్లల్లో నిప్పులు పోసుకుంటూ కడుపుమంటతో రగిలిపోతున్నరు..’ అని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. అజ్ఞానం, అవివేకంతో రాష్ట్రానికి ద్రోహం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు పడుతున్న గోసను చూసే కేసీఆర్ ఆర్తితో, ముందుచూపుతో అనేక నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరంతోపాటు పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్ తదితర నీటిపారుదల పథకాలను అకుంఠిత దీక్షతో ప్రారంభించారని చెప్పారు. ఇంజినీర్లు, జలరంగ నిపుణులతో చర్చించి రూ.వేలాది కోట్లు వెచ్చించి ప్రాజెక్టులను పూర్తిచేశారని వివరించారు. కానీ, చిన్నచిన్న లోపాలను పెద్దవిగా చూపుతూ అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వారి చిల్లర ప్రయత్నాలు, పిచ్చి కలలు కల్లలు కాక తప్పదని చెప్పారు. కేసీఆర్ ఇంజినీర్ అవతారమెత్తి ప్రాజెక్టులను రీడిజైన్ చేశారంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే ఏ రంగంలోని నిపుణులైనా వారి బాధలు, ఆర్తిని తీర్చేందుకు యత్నిస్తారని, బ్రిటిష్ పాలనలో మిలటరీ అధికారిగా ఉన్న సర్ ఆర్థర్ కాటన్ ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జిల్లాల్లోని దుర్భిక్షాన్ని పారదోలారని గుర్తుచేశారు. ఆయనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక బ్రిటిష్ పాలకులు విచారణ కమిటీలు వేసి ఇబ్బందిపెట్టారని చెప్పారు. కానీ, గోదావరి జిల్లాల ప్రజలు మాత్రం ఇప్పటికీ కాటన్‌ను గుండెల్లో పెట్టి కొలుచుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదే తరహాలో కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతల కుట్రలు, కుతంత్రాలకు కేసీఆర్ కీర్తి మసకబారదని స్పష్టంచేశారు.
అన్ని అనుమతులు తెచ్చి, అంతర్రాష్ట్ర వివాదాలు రాకుండా చేసి చేపట్టిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎలాంటి ముందుచూపు లేకుండా నిపుణుల సూచనలు తీసుకోకుండా చేపట్టిన ఎస్ఎల్బీసీపై విచారణ కమిషన్‌ను ఎందుకు వేయరు? ఎనిమిది మంది ప్రాణాలు పోయిన పట్టింపులేదేందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఓ నీతి.. ఎస్ఎల్బీసీ విషయంలో మరో నీతా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లేదంటే రేపటి తెలంగాణలో చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చిరుమల్ల రాకేశ్, అభిలాష్‌గౌడ్ పాల్గొన్నారు.
ఘోష్ కమిషన్ నివేదికను బయటపెట్టకుండానే అధికార పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను దాచిపెట్టేందుకే నివేదికను 10 శాతానికి కుదించారని అనుమానం వ్యక్తంచేశారు. నిబద్ధతతో చేపట్టిన విచారణలో తాము లెవనెత్తిన అంశాలు కూడా ఉంటాయని, కానీ రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన విచారణలో పారదర్శకత ఉండదని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బయటపెట్టక ముందే ఓ మీడియా సంస్థకు ఎలా చేరిందని నిలదీశారు. నివేదిక ఎలా ఉన్నా తమ పార్టీ నేత హరీశ్‌రావు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజనిజాలను సవివరంగా ప్రజల ముందు ఉంచుతారని స్పష్టంచేశారు. కమిషన్ రిపోర్ట్ ఫైనల్ కాదని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని తేల్చిచెప్పారు. గతంలో కేంద్రం వేసిన కాంగ్రెస్ షా కమిషన్‌ను వ్యతిరేకించిందని గుర్తుచేశారు.