హైదరాబాద్ జూలై 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నీటి హక్కులను గురుదక్షిణ కింద చంద్రబాబుకు తాకట్టు పెడితే ఊరుకొనేది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకోవడం తప్ప ఈ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీలేదని నిప్పులు చెరిగారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను విషం తాగి చావమని దూషిస్తూ, వచ్చే రాష్ర్టాన్ని అడ్డుకొని ఇక్కడి బిడ్డల బలిదానాలకు కారణమైన చంద్రబాబును దేబిరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. 20 నెలల పాలనలో నియంత పోకడలు, నికృష్టపు మాటలు తప్ప ప్రజలను ఉద్ధ్దరించిందేమీలేదని ఫైర్ అయ్యారు.
మొన్న కొల్లాపూర్ సభలో 40 నిమిషాల ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ జపం చేశారని, కేసీఆర్‌పై దూషణలకు దిగడం తప్ప ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు రేవంత్ కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా ఇచ్చిందిలేదని విరుచుకుపడ్డారు. అధికారికంగా నిర్వహించిన సభలో అడ్డగోలు అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. ‘ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా భాష మార్చుకోవడంలేదు.. ఇప్పటిదాకా ఒపికపట్టినం.. ఇకమీదట సహించబోం’ అని తీవ్రంగా హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి ఒక పొలిటికల్ లక్కీ భాస్కర్ అని, పదేపదే తాను పదేండ్లు సీఎంగా ఉంటానని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. రేవంత్ మాటలను సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డే ఖండించారని గుర్తుచేశారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కురువ విజయ్‌కుమార్, అభిలాష్గౌడ్తో కలిసి నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
పాలమూరు జిల్లాలో ఆరు నెలల క్రితం శిలాఫలకం వేసిన యంగ్ ఇండియా స్కూల్‌కు ఇంతవరకు దిక్కులేదని విమర్శించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ విధ్వంసమైందని మండిపడ్డారు. ‘ఈ విషయం నేను చెప్పడంలేదు..గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి అన్నడు. మానాన్న చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు దొరకలేదు..ఇది సమైక్య పాలనలో తెలంగాణ దుస్థితి అని నిండు శాసససభలో కుండబద్దలు కొట్టిండు’ అని గుర్తుచేశారు. ఉమ్మడి పాలకులు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలాలను మార్చి దగా చేశారని దుయ్యబట్టారు.
జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయిన నీచపు చరిత్ర ఆ పార్టీ సొంతమని తూర్పారబట్టారు. ‘జూరాల నిర్మాణానికి నలభై ఏండ్లు తీసుకున్నరు. 87,500 ఎకరాలు పారే ఆర్డీఎస్ కెనాల్‌ను 8 వేల ఎకరాలకు పరిమితం చేసిండ్రు. 1984లో మొదలుపెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ. 2700 కోట్లు ఖర్చుపెట్టి 2014 నాటికి సగం కూడా పూర్తిచేయలేదు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ రూ.3400 కోట్లు వెచ్చించి రెండేండ్లలో పూర్తిచేసి 40 టీఎంసీలు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుపుల్ల వేసిండ్రు’ అని వివరించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు, చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నా రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకొనేందుకు ప్రధాని మోదీకి భక్తుడిగా మారాడని నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. విశ్వాస ఘాతకుడని గ్రహించే ఆయనకు ఢిల్లీలో రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని ఎద్దేవాచేశారు. రేవంత్ లాగా కాంగ్రెస్‌లో ఉండి మోదీకి ఊడిగం చేయబోమని.. నికాైర్సెన బీఆర్ఎస్ సభ్యులమని, కేసీఆర్ విధేయులమని స్పష్టం చేశారు. ‘రేవంత్‌కు తెలంగాణ ఉద్యమంతో ఏసంబంధమూ లేదు. ఆంధ్రా బాబుల కనుసన్నల్లో ఇక్కడి ప్రాంతానికి ద్రోహం చేసిండు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, పెట్రేగితే చూస్తూ ఊరుకునేది లేదు. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటది. ఆయనకంటే తిట్లు, నీచమైన భాషతో విరుచుకుపడాల్సి వస్తది. ప్రజలు సైతం తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నయి’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 19 నెలల్లో పాలమూరు జిల్లాకు రేవంత్ చేసిందేమీలేదని దుయ్యబట్టారు. తాము నిరంతరం శ్రమించి వెనుకబడిన జిల్లా రూపురేఖలను మార్చామని గుర్తుచేశారు. నాడు కృష్ణా నదిలో నీళ్లు రాగానే ఒడిసిపట్టుకొని చెరువులు, కుంటలు నింపుకొనే వారమని, ఈ ఏడు మేలో వరదలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి వదిలి ఆంధ్రాకు మేలు చేసిందని మండిపడ్డారు. నల్లమల పులిబిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి..చంద్రబాబు చేతిలో పిల్లిలా మారి ప్రాజెక్టులు కట్టవద్దని ప్రాధేయపడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు. ‘అడుక్కోవడం కాదు.. దమ్ముంటే బనకచర్ల కట్టవద్దని కొట్లాడు’ అని సవాల్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో చెప్పుకోడానికి ఏమీలేక కేసీఆర్‌ను విమర్శించేందుకే కొల్లాపూర్ సభ పెట్టారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని స్పష్టంచేశారు. రోడ్లు నిర్మించడమే గాకుండా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరందించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని గుర్తుచేశారు. కేసీఆర్‌పై కక్షతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అటకెక్కించారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావు అభివృద్ధిని విస్మరిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాన్ని గాలికొదిలి సీఎం మెప్పుకోసం బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నాడు కృష్ణా నదిలో నీళ్లు రాగానే ఒడిసిపట్టుకొని చెరువులు, కుంటలను నింపుకొనే వాళ్లం. కానీ ఈ ఏడు మేలోనే వరదలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి వదిలి ఆంధ్రాకు మేలు చేసింది. నల్లమల పులిబిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి..చంద్రబాబు చేతిలో పిల్లిబిడ్డగా మారి ప్రాజెక్టులు కట్టవద్దని ప్రాధేయపడుతూ తెలంగాణ పరువు తీస్తున్నడు. అడుక్కోవడం కాదు.. దమ్ముంటే బనకచర్ల కట్టవద్దని కొట్లాడు.
– శ్రీనివాస్‌గౌడ్
‘19 నెలల కాంగ్రెస్ పాలనలో మీరు ఏం ఉద్ధరించారని కేసీఆర్ కుమిలిపోతరు?’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? రూ.344 కోట్లతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నందుకా? సగం రుణమాఫీ చేసినందుకా? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎత్తేసినందుకా? ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టినందుకా? పురుడు పోసుకున్న ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కింద ఇచ్చే రూ.13 వేలు ఎగ్గొట్టినందుకా?’ అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి చెప్పుకొనేందుకు ఏమీలేక కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ రోజూ మహోన్నత వ్యక్తి నెల్సన్ మండేలా జయంతి అని, ఈ రోజైనా రేవంత్‌రెడ్డి జ్ఞానోదయం పొంది అబద్ధాలు బంద్‌పెట్టి ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకుసాగాలని హితవు పలికారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.38 వేల కోట్లు వెచ్చించి 90 శాతం పనులు పూర్తిచేసింది కేసీఆర్ కాదా? ఇప్పుడు పాలమూరులో కనిపిస్తున్న నీళ్లు కేసీఆర్ తెచ్చినవి కావా? మొన్న కొల్లాపూర్‌లో రేవంత్‌రెడ్డి ప్రయాణించిన రోడ్డు కేసీఆర్ వేసింది కాదా? కండ్ల ముందు కళకళలాడుతున్న పచ్చని పైర్లకు కేసీఆర్ కారణం కాదా? ఆయన పాలనలో వలసలు ఆగిపోయింది నిజం కాదా? ఉమ్మడి జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలిచ్చింది కేసీఆర్ కాదా? అందులో ఓ కాలేజీని రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తీసుకెళ్లింది వాస్తవం కాదా?
– నిరంజన్‌రెడ్డి