నీలగిరి, ఆగస్టు 18: రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేసిందని, అందరికీ అని చెప్పి కొందరికే వర్తింపజేశారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేయడంలో పోటీలు పడుతున్నాయని విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం అగ్రిషోలో పాల్గొ న్న అనంతరం ఆయన మాట్లాడారు. రైతు జీవితం అందరినీ నమ్మడం, మోసపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ వరకు రైతుది అదే కథ అని చెప్పారు.
రుణమాఫీ కాని రైతుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వెంటనే రెండు లక్షల రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, అగ్రిషో నిర్వాహకుడు జూలకంటి రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.