హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పోరుబాట, పాదయాత్ర భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొద్దునిద్ర వీడి పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేండ్లలో పాలమూరు ప్రాజెక్టులపై కండ్లు తెరువకుండా, విలువైన సమయాన్ని వృథా చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు.
మిగిలిన 10% పనులను పూర్తి చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. రెండున్నరేండ్లుగా ఈ ప్రాజెక్టు పరిధిలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా పనులను పడావు పెట్టారని ఆరోపించారు. కాలువల టెండర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరుగుతున్నదని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తిచేసి ఉంటే, ఈ ఏడాది నార్లాపూర్తోపాటు ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని తెలిపారు. కేసీఆర్ మీద కక్షతో పాలమూరు జిల్లా రైతులను మోసం చేయొద్దని సీఎం రేవంత్‌కి హితవు పలికారు.
తాను పాలమూరు బిడ్డనని గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గత రెండున్నరేండ్ల్లుగా పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు సమీక్ష నిర్వహించలేదని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో ఇటీవల సమావేశమైన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వైఖరిపై ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారని తెలిపారు. ప్రజలను, రైతులను చైతన్యపరుస్తూ నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు భారీ పాదయాత్ర చేపట్టాలని ఈ నెల 15న నిర్ణయించామని వెల్లడించారు.
ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించాలని ప్రతిపాదించామని, ఈ ఉమ్మడి పోరాటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సీఎం అత్యవసర సమీక్షా నాటకానికి తెరలేపారని విమర్శించారు. ముఖ్యమంత్రి సమీక్ష కేవలం మొకుబడిగా కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించి, మొత్తం ఐదు మోటర్లు నిరంతరాయంగా నడిచేలా చర్యలు చేపట్టాలని కోరారు.
నార్లాపూర్-ఏదుల- వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఈ ఏడాదే నీటిని ఎత్తిపోసుకొని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పోరుబాట ప్రకటన వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యే వరకు తమ పోరాటాలు ఆగవని స్పష్టంచేశారు.