హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర జలసంఘం నిపుణులే కొనియాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమని ప్రశంసించారని చెప్పారు. కానీ, తప్పుడు ఆరోపణలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేసి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను పిలిచి తకువ చేయాలని చూస్తున్నదని విమర్శించారు. డ్యామేజీ ఎలా జరిగిందో తెలుసుకోకుండా కేసీఆర్‌ను బద్నాం చేయాలని కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ అనంతరం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ భారీ ప్రాజెక్టులు కట్టారని గుర్తుచేశారు. తాగు, సాగునీరు అందించి అన్నిరంగాలను అభివృద్ధి చేశారని చెప్పారు. సాగు, తాగునీటి రంగాల అవసరం తీరుతుందనే ఈ ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే కాంగ్రెస్ విషం చిమ్ముతూనే వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్ట్ కట్టినా 30 ఏండ్లు పట్టిందని గుర్తుచేశారు. కానీ, మంత్రిమండలి, నిపుణులు, కేంద్ర జలసంఘం సూచనలు, పొరుగు రాష్ట్రం అనుమతులతో కాళేశ్వరంను వేగంగా పూర్తిచేశామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టును నిర్మించినట్టు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు సాగునీరు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.