హైదరాబాద్, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ) : విద్యుత్తు కోతలకు తోడు, సాగునీరు అందక పచ్చని పంటలు కండ్లముందే ఎండిపోతున్నా కాపాడుకోలేపోతున్న రైతుల గోసను, ఆవేదనను రేవంత్‌రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కుదవబెట్టి పది వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి రూ.750 కోట్లు రైతుబీమా ప్రీమియం చెల్లించడానికి ఎందుకు మనసు రావడం లేదు? అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించేలా కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని రూపొందించింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా దీన్ని తీర్చిదిద్దింది. రైతు చనిపోయిన ఏడు పనిదినాల్లో ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేది. రైతుబీమా, రైతుబంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రశంసించింద’ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అభయహస్తం కింద ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు అమలుచేయడం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ‘ప్రభుత్వ భూములను కుదువపెట్టి రైతుభరోసా కోసమని రూ.10 వేల కోట్లు తెచ్చి రెండు నెలలు అవుతున్నది. అయినా మూడెకరాల వరకు నిధులు పడలేదు. మూడెకరాల వరకు రైతుభరోసా ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెప్తుంటే, డబ్బులు వేయాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయమే లేదు. పంటలు వేసుకున్న తర్వాత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో రైతులు పంటలు వేసుకోవద్దని చెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి చెప్పకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సాగునీళ్లకు కొరత లేదని చెప్పించారు. నీటికి, కరెంటుకు సమస్య లేకుంటే రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నట్టు? పంటలు పశువులకు మేత ఎందుకు అవుతున్నట్టు? ప్రభుత్వం సాగునీటి మీద సమీక్ష ఎందుకు చేయలేదు? ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖల మంత్రులకు ధైర్యముంటే పంటలు ఎండుతున్న పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలి. రాష్ట్రంలో పం టలు ఎండ టం లేదని ప్రభుత్వం ప్రకటించా లి’ అని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో సమృద్ధిగా వాన లు పడి, పుషలంగా నీళ్లున్నా నీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. కరెం టు, సాగునీరు, రైతుభరోసా ఇవ్వని కారణం గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతాం గం బాధలను దిగమింగాలి కా నీ ఆత్మహత్యలకు పాల్పడవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. సమ యం వచ్చినప్పుడు రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
పది వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి రూ.750 కోట్లు రైతుబీమా ప్రీమియం చెల్లించడానికి ఎందుకు మనసు రావడం లేదు? ఇది రైతు అనుకూల ప్రభుత్వమా? రైతుబీమాను ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది.
‘రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు వివిధ కారణాలతో రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా ఆ రైతు కుటుంబాలకు రూ.5,909.85 కోట్లు పరిహారంగా అందాయి. రైతుబీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,122.65 కోట్లు ఎల్ఐసీకి ప్రీమియంగా చెల్లించింది. ఏడాదికి రూ.1,500 కోట్లకుగాను, రెండో విడత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.750 కోట్ల ప్రీమియం చెల్లించని కారణంగా ఏడు వేలపై చిలుకు రైతు కుటుంబాల పరిహారం పెండింగ్‌లో ఉన్నది. 15 నెలల కాంగ్రెస్ పాలనలో 440 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.