హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బ్రహ్మంగారికి సిద్ధయ్యలా కేసీఆర్‌కు హరీశ్‌రావు వెన్నంటి ఉన్నారని, అలాంటి హరీశ్‌ను టార్గెట్ చేసుకోవడం బాధాకరమని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్పైనా, పార్టీ అధినేత కేసీఆర్‌పైనా కుట్రలు, కుతంత్రాలు సాగుతున్న తరుణంలో కొందరు దేశద్రోహులకు వంతపాడటం, శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటం విడ్డూరమని అన్నారు. పార్టీకి రక్షణ కవచంగా నిలుస్తూ ప్రభుత్వ చర్యలను ఖండించాల్సిన సమయంలో విమర్శలు గుప్పిస్తూ శత్రుపక్షాలకు అస్ర్తాలు అందించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం, మంత్రులు 33 సార్లు అడ్డుపడ్డా కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు కుట్రలను ఛేదించిన గొప్ప నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, ముఠా గోపాల్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వ్యవహారం నేపథ్యంలో నిరంజన్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
సభలో అడుగడుగునా ప్రభుత్వ దుష్టపన్నాగాలను చీల్చి చెండాడిన హరీశ్‌రావును ఉద్దేశించి రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నారని, ఆయనతో కలిసి విమానంలో ప్రయాణించి కుట్రలు చేశారని అన్న మాటలను తెలంగాణ సమాజం నమ్మబోదని తేల్చి చెప్పారు. శత్రువులకు అండగా నిలిచిన వారిని ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. కవిత మాటలు పూర్తిగా సత్యదూరమని కొట్టిపడేశారు. జలదృశ్యంలో పార్టీ జెండా గద్దె నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు హరీశ్‌రావు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. అధినేత ఆజ్ఞను శిరసావహించారే తప్ప ఏనాడూ ధిక్కరించలేదని గుర్తుచేశారు. పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. ఆయన పనితీరు, ప్రజల కోసం పరితపించే తీరు పార్టీలోని నేతలందరికీ ఆదర్శమని ప్రశంసించారు. బ్రహ్మంగారికి సిద్ధయ్యలా నిత్యం కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేసి అంకితభావానికి మారుపేరుగా నిలిచారని హరీశ్‌రావును కొనియాడారు. బీఆర్ఎస్కు ఆయన తరగని సంపద అని ప్రశంసించారు. ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించని సంతోష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు.
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హరీశ్‌రావు సహకరించారని, ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు హరీశ్‌రావే ప్రయత్నించారని పరస్పర విరుద్ధంగా మాట్లాడటం హాస్యాస్పదమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈటల వ్యవహారంలో అధినేత నిర్ణయం ప్రకారమే హరీశ్‌రావు నడుచుకున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు సమర్థంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నారని, ప్రజా సమస్యలపై అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాడుతున్నారని చెప్పా రు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలువాల్సిన వారే ధిక్కార స్వరం వినిపించడం సరికాదని హితవు పలికారు. కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు ఆమె బెయిల్ కోసం కేటీఆర్, హరీశ్ ఇద్దరు కలి సి కృషి చేసిన విషయాన్ని విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకోవడం తప్ప రేవంత్‌రెడ్డి తన పురిటిగడ్డకు చేసిందేమీ లేదని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, జిల్లా రైతాంగానికి యూరియా కూడా అందించలేని అసమర్థుడు రేవంత్‌రెడ్డి అని నిప్పులు చెరిగారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి రేవంత్ తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు కొబ్బరికాయ కొట్టారని ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో పచ్చబడిన పాలమూరులో 21 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన లేమితో బీఆర్ఎస్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఏర్పాటును వ్యతిరేకించడంతోనే టీడీపీ కనుమరుగైందని, రేవంత్ మాత్రం బీఆర్ఎస్ కుట్రలు చేసి టీడీపీ కనుమరుగు చేసిందని బాధపడిపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. టీడీపీ తరహాలోనే బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కోలేకే మోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కూడబలుక్కుని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
కాళేశ్వరంపై లొట్టపీసు కమిషన్‌ను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరిని ఏపీకి కట్టబెట్టేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. సీఎంకు దమ్ముంటే తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తన రెండేండ్ల పాలనలో పాలమూరు జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని రేవంత్‌రెడ్డిని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్‌కు తరలించిన సీఎం కాలేజీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అజంఅలీ, ఇంతియాజ్ ఇసాక్ పాల్గొన్నారు.