హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతులపై లాఠీచార్జి ఘటన అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం దమననీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇథనాల్ పరిశ్రమ స్థాపించబోమని రైతులకు హామీ ఇచ్చి, మళ్లీ అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించడం మోసం చేయడమేనని విమర్శించారు.
ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించిన రైతులు, రైతు కుటుంబాలపై పోలీసులు జరిపిన లాఠీచార్జి హేయమని పేర్కొన్నారు. 40 మం ది రైతులను అదుపులోకి తీసుకుని, 12 మందిపై కేసులు పెట్టి రిమాండ్‌కు పంపడం దుర్మార్గమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యాలకు, కుటిల నీతికి భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించి, నిరసన తెలిపిన రైతులపై లాఠీచార్జి చేయడంతోపాటు వారిని అరెస్టు చేసి, రిమాండ్ పంపడాన్ని నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.