హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : సింగరేణి పరిరక్షణ కోసం బొగ్గు గని కార్మికలోకం పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థను ఆర్థిక కష్టాల నుంచి కాపాడుకొనేందుకు నడుంకట్టింది. ఇందులో భాగంగా సంస్థకు విద్యుత్తు సంస్థలు చెల్లించాల్సిన రూ.46వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) మంగళవారం చలో విద్యుత్తు సౌధకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వందలాది మంది కార్మికులు తరలిరానున్నారని, సంస్థను కాపాడుకొనేందుకు ‘బొగ్గు బకాయికో బండి.. వేలాదిగా తరలిరండి’ అని యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కోరారు.
రూ.46వేల కోట్ల బకాయిలు
అధికారిక లెక్కల ప్రకారం 2025 డిసెంబర్ వరకే విద్యుత్తు సంస్థలు సింగరేణికి రూ.46,206 కోట్లు బకాయి పడ్డాయి. సింగరేణి నుంచి కొన్న బొగ్గుకు రూ.18వేల కోట్లు, విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి రూ. 27వేల కోట్ల బకాయిలున్నాయి. గతంలో విద్యుత్తు బకాయిలు మాత్రమే ఉంటే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక బొగ్గు, విద్యుత్తు బకాయిలు కలిపి గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీని వల్ల సంస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ప్రతి నెలా వేతనాలు, డీజిల్ ఖర్చులకు వందల కోట్లు అప్పు తెస్తున్నది. టీజీ జెన్కో, రాష్ట్ర ప్రభుత్వం రూ.46వేల కోట్లు సింగరేణికి బకాయిపడ్డాయి. సంస్థ వినియోగించిన విద్యుత్తుకు మాత్రం ప్రతి నెలా రూ.42కోట్లు డిస్కమ్‌కు చెల్లిస్తున్నది. ఇక సంస్థ కాంట్రాక్టర్లకు డబ్బు లు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. సింగరేణి థర్మల్‌ప్లాంట్ నిర్మాణానికి తెచ్చిన అప్పు, వడ్డీ కలిపితే ఏడాదికి రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. వీటిని చెల్లించేందుకు నిధులు సర్దుబాటు కాక మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది.
ఇదీ పరిస్థితి
అధికారుల వేధింపులతో..సింగరేణి కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల జిల్లా శాంతిఖని భూగర్భగనిలో కలకలం మందమర్రి ఏరియాలోని శాంతిఖని భూగర్భగనికి చెందిన మల్టీజాబ్ వర్కర్ మాధవ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలంరేపింది. జనరల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న మాధవ్ అధికారుల వేధింపులు భరించలేక సోమవారం పెట్రోలు ఒంటిపై పోసుకున్నాడు. వెంటనే గమనించిన తోటి కార్మికులు అడ్డుకున్నారు. జనరల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న మాధవ్‌ను ఒక్కసారిగా అధికారులు షిఫ్ట్‌లోకి మార్చారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు బాధితుడు పేర్కొన్నారు.