జహీరాబాద్, ఆగస్టు 8 : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలు, చెత్తచెదారంతో దర్శనమిస్తున్నాయి. ఆటలు అడుకునేందుకు క్రీడా పరికరాలు అందుబాటులో లేకపోవడంతో క్రీడాకారులు ఆసక్తి చూపడం లేదు. సంబంధిత అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతున్నది.
జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్రీడాప్రాంగణాలను పల్లెలకు విస్తరించాలనే ఉద్దేశంతో తొలి సీఎం కేసీఆర్ వీటి ఏర్పాటుకు కృషిచేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 204పైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. పలుచోట స్థలాల సమస్య తలెత్తడంతో అధికారులు అనుకూలమైన స్థలాలను ఎంపిక చేసి, ఆదరాబాదరగా క్రీడా ప్రాంగణాలు ప్రారంభించారు. వాటిలో ఏర్పాటు చేసిన క్రీడా సామగ్రి ఆటలు అడుకునేందుకు అనుకూలంగా లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. చాలాచోట్ల గ్రామాలకు దూరంగా క్రీడా ప్రాంగణాల బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు.
కనీసం ప్రాంగణాలను కూడా చదును చేయలేదు. పలు క్రీడా ప్రాంగణాల్లో కబడ్టీ, వాలీబాల్, షటిల్ వాంటి క్రీడలు అడేందుకు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా సామగ్రిని సమకూర్చారు. కానీ, ఈ క్రీడా ప్రాంగణాలకు వచ్చేందుకు క్రీడాకారులు, యువకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా గ్రామాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బోర్డులు కూడా పెట్టలేదు. ఆట సామగ్రి కూడా పంచాయతీ భవనాల్లో ఉండిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో స్థలం దొరకక వదిలిపెట్టారు. అధికారులు వీటి నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో గత ప్రభుత్వ ఆశయం నీరుగారుతున్నది.