KTR | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి వే బ్రిడ్జిల వద్ద బొగ్గు లారీ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలంటూ సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్, అన్లోడింగ్ లెవలింగ్ వరర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కే తారకరామారావును కలిసిన సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలోని 47 వే బ్రిడ్జిల వద్ద 1,755 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.
లోడింగ్, అన్లోడింగ్ కార్మికులకు వైద్య పరీక్షలు, మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఎంవీటీసీ) ఉచిత శిక్షణను సింగరేణి సంస్థ చేపట్టాలని, కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) సౌకర్యం కూడా కల్పించాలని, సింగరేణిలో ఖాళీ క్వార్టర్స్‌ను కార్మికులకు కేటాయించాలని కోరారు. తీవ్ర అన్యాయానికి గురవుతున్న కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ను కలిసినవారిలో ఆ సంఘం అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి యాకూబ్షా వలి తదితరులు ఉన్నారు.