గోదావరిఖని, జనవరి 22: నమస్తే తెలంగాణ కథనాలతో ఎట్టకేలకు సింగరేణి దిగొచ్చింది. ఉద్యోగ విరమణ, సర్వీసులో ఉన్న అధికారులకు (పర్ఫామెన్స్ రిలేటెడ్ పే) పీఆర్పీ చెల్లించాలని నిర్ణయించింది. సింగరేణి నుంచి ఉద్యోగ విరమణ చేసిన 350 మందికి పైగా అధికారులు 2007 నుంచి 2014 మధ్య కాలానికి సం బంధించి పీఆర్పీ బకాయిలు రావాల్సి ఉండగా, సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. రెండేండ్ల క్రితమే చెల్లించాలని కోర్టు ఆదేశించినా యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేకుండా పోయింది.
ఈ ఏడు ఆర్థిక సంవత్సరాలకు గాను విధుల్లో కొనసాగుతున్న అధికారులకూ పీఆర్పీ రావాల్సి ఉండగా, యాజమాన్యం పట్టించుకోలేదు. పీఆర్పీ చెల్లింపులో నిర్లక్ష్యంపై ‘రిటైర్డ్, సర్వీసు అధికారులపై సింగరేణి చిన్నచూపు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితం కాగా, యాజమాన్యం స్పందించింది. ఈ నెల 29న మొత్తం 63కోట్ల పీఆర్పీ చెల్లించనున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అధికారులకు 275 కోట్ల పీఆర్పీ చెల్లించాల్సి ఉంది.