Singareni Scam | సిరులగని సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా? అంతా తాను చెప్పినట్టే, తన కనుసన్నల్లోనే జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పినవారికే దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగ్‌లు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి సింగరేణి వర్గాలు.
ఇప్పటికే ముఖ్యనేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు. మరోవ్యక్తి సాగునీటిపారుదల శాఖను గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకొకరు పరిశ్రమల శాఖలో పాతుకుపోయారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్యనేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు చర్చ జరుగుతున్నది. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో రెండేండ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్యనేత బావమరిది ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కించుకోవడం.. ఇలా సంస్థకు నష్టం చేకూర్చుతున్న ప్రతి నిర్ణయం వెనుక ఆయనదే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్ట్ తీసుకున్నా, మందుల సరఫరా అయినా, ట్రాన్స్పోర్ట్ టెండర్ అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతున్నదని అంటున్నారు. బావ అండ చూసుకొని ఆయన రెచ్చిపోతున్నాడని, ఆయన ఆగడాలను సింగరేణి సంస్థ అధికారులు భరించలేకపోతున్నారని చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. బావమరిది కంపెనీ రెండేండ్ల కిందటి వరకు తెలంగాణలో ఒక్క జిల్లాకే పరిమితమని, కానీ ఇప్పుడు క్రమంగా పక్క రాష్ర్టాలకు విస్తరిస్తున్నదని తెలుస్తున్నది. ఇప్పటికే సింగరేణిపై పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు కర్ణాటకపై కన్నేసిందట! రెండుచోట్ల ఒకేపార్టీ అధికారంలో ఉండటాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి కాంట్రాక్టర్లను పక్కకు నెడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కాంట్రాక్ట్‌ను కైవసం చేసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
లెస్ కోట్ నుంచి ప్లస్ కోట్కు..
సింగరేణిలో జరిగే టెండర్ల వ్యవహారంలో మొత్తం ముఖ్యనేత బావమరిది హవా నడుస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. పర్సంటేజీలు మాట్లాడటం నుంచి మొదలు వాటాలు పంచడం వరకు అంతా ఆయన కనుసన్నల్లో పద్ధతి ప్రకారం జరిగిపోతున్నదట! కాంట్రాక్టర్లు రింగ్ కావడం, డమ్మీల చేత టెండర్లు వేయించడం, కలిసి పంచుకోవడంలో కీలకపాత్ర ఆయనదే అని చెప్పుకొంటున్నారు. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు లెస్ కోట్ చేసేవారని, కానీ ఇప్పుడు కీలక టెండర్లన్నింటిలో ప్లస్ కోట్ చేస్తున్నారని, వారికే టెండర్లు కేటాయిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. దీని వెనుక ముఖ్యనేత బావమరిది ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పేలుడు పదార్థాలను టన్ను రూ.17-18 వేలకు కొనేవారని, ఇప్పుడు టన్ను రూ.50 వేలకు పెంచారని అంటున్నారు. దీని వెనుక కీలక హస్తం ఆయనదేనని స్పష్టం చేస్తున్నారు. గతంలో సింగరేణిలో టెండర్లు అంటే పారదర్శకంగా సాగేవని, వివాదాస్పదం కావడం అరుదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఇరిగేషన్‌శాఖలో మాదిరిగా అవలక్షణాలన్నీ సింగరేణికి వ్యాపించాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అధికారులపై సూపర్వైజర్ల పెత్తనం
ముఖ్యనేత బావమరిది పేరు చెప్తేనే సింగరేణి సంస్థలో పనిచేసే జీఎంలు, కిందిస్థాయి సిబ్బంది వణికిపోతున్నారని, ఆ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. ఆయనకు చెందిన కాంట్రాక్ట్ సంస్థ సూపర్వైజర్లు ఏకంగా సింగరేణి సంస్థ అధికారులకే ధమ్కీలు ఇస్తున్నారట! దీనిని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. కొత్తగూడెంలోని ఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ తాము చెప్పినట్టు నడుచుకోవడంలేదని రాత్రికి రాత్రే బదిలీ చేయించి మరో ఆఫీసర్‌కు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు సంస్థలో ప్రచారం జరుగుతున్నది. రోజుకూ 8 గంటలు పనిచేయాల్సిన కార్మికులను ఈ కాంట్రాక్ట్ సంస్థ 12 గంటల పాటు పనిచేయించుకుంటూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా అడిగే నాథుడే లేడని అంటున్నారు. ఓపెన్ కాస్టుల్లో దుమ్ము లేవకుండా నీళ్లు స్ప్రే చేయించాల్సి ఉంటుంది. అయితే సదరు కాంట్రాక్టర్ ఇలా చేయకపోవడంతో ఓ అధికారి ప్రశ్నించగా, సంస్థ సిబ్బంది బెదిరింపులకు పాల్పడ్డారట! చివరికి డీజిల్ మిగుల్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోడ్‌ను ఒక చోట డంప్ చేయాల్సి ఉండగా, మరో చోట డంప్ చేస్తున్నారని, లోడింగ్‌కు వెళ్లిన మార్గంలోనే అన్‌లోడింగ్‌కు రావాల్సి ఉండగా, బైపాస్ మార్గాల్లో వస్తూ రెండు, మూడు కిలోమీటర్లు తగ్గించుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
మధ్యలో అధికారులు బలి
తాము చెప్పిన పనులు మాత్రమే చేయాలని, అన్నింటికీ తలూపాల్సిందేనని సింగరేణి అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు చెప్పుకొంటున్నారు. ఇందుకు ససేమిరా అనే అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని అంటున్నారు. ముఖ్యనేత బావమరిది, సర్కార్ పెద్దలకు నచ్చినట్టు నడుచుకోవడం ఇష్టంలేక ఇద్దరు సింగరేణి సంస్థ డైరెక్టర్లు బలయ్యారన్న ప్రచారం జరుగుతున్నది. వీరిలో ఒకరు ఆరు నెలల ముందే రాజీనామా చేసి వెళ్లిపోయారట! వాస్తవానికి ఆ ఇద్దరు డైరెక్టర్లకు సంస్థలో మంచి అధికారులుగా పేరున్నది. అయితే కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు కల్పించేలా టెండర్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేశారట! ఇది సింగరేణికి నష్టం కలిగిస్తుందని ఇద్దరు అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఇవి అమలైతే సంస్థకు రూ.450 500 కోట్ల నష్టం కలుగుతుందని, దీనికి ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పారట! దీంతో ఆగ్రహించిన ముఖ్యనేత వర్గం ఓ డైరెక్టర్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తప్పించిందట! ఆ అధికారి డైరెక్టర్ పదవిని వదులుకుని, డీ ప్రమోట్ అయ్యి కింది స్థాయిలో జీఎంగా చేరినట్టు చెప్పుకొంటున్నారు. మరో డైరెక్టర్ అయితే తీవ్ర ఒత్తిడి రావడం, బెదిరింపులతో చేసేదేం లేక ఆరు నెలల పదవీ కాలాన్ని వదులుకొని ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అనుకూలమైన వారిని డైరెక్టర్లుగా వారి స్థానాల్లో నియమించుకున్నారట! మొత్తంగా సంస్థకు ప్రయోజనం కలిగించబోయి, పెద్దలకు ఎదురువెళ్లి బలిపశువులయ్యారన్న ప్రచారం సింగరేణిలో జరుగుతున్నది. కొత్తగూడెంలోని ఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ తాము చెప్పినట్టు నడుచుకోకపోవడం ముఖ్యనేత బావమరిదికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందట! వెంటనే ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి బదిలీ చేయించి మరో ఆఫీసర్‌కు పోస్టింగ్ ఇప్పించుకున్నారట!
పెనాల్టీల మాఫీలోనూ హస్తం
సింగరేణిలో డీజిల్ కుంభకోణం, పెనాల్టీల మాఫీ వెనుక సదరు బావమరిది పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. డీజిల్ పెనాల్టీల మాఫీ మం త్రాంగం అంతా ఆయన స్కెచ్ అన్న ప్రచారం ఉన్నది. గతంలో డీజిల్ ఎక్కువ వాడినందుకు అధికారులు పలు సంస్థలకు రూ.25-30 కోట్లు పెనాల్టీ వేశారు. ఓ కాంట్రాక్ట్ సంస్థ రూ.200 కోట్ల డీజిల్ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ముఖ్యనేత బావమరిది పెనాల్టీల మాఫీకి ఓ స్కెచ్ వేశారట! కాంట్రాక్ట్ సంస్థలు పెనాల్టీలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లడం, కోర్టుల్లో సంస్థ తరఫున వాదనలు సరిగ్గా వినిపించకపోవడం, పెనాల్టీలను రద్దు చేసేలా తీర్పు వచ్చేలా చేయడం.. ఇదంతా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నదట!