కొత్తగూడెం సింగరేణి/ఇల్లెందు/మణుగూరు టౌన్/గోదావరిఖని, జూన్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండివైఖరిని విడనాడి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేశారు. సింగరేణివ్యాప్తంగా కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) ఆధ్వర్యంలో అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పే అప్‌గ్రే డేషన్‌ను వెంటనే అమలు చేయాలని, పీఆర్పీ బకాయిలను చెల్లించాలని, ప్రతి ఆరునెలలకోసారి స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు తమ న్యాయమైన అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సంస్థవ్యాప్తంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి, భూపాలపల్లి, రామగుండం 1, 2, 3, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లోని జీఎం కార్యాలయాల ఎదుట సింగరేణి అధికారులు రిలే దీక్షలు కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో సీఎంవోఏఐ జనరల్ సెక్రటరీ సీహెచ్ రాజగోపాల్, మెయిన్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బీ శేషగిరిరావు, సివిల్ డిపార్ట్మెంట్ ఏఈ శ్రీరాం కరుణాకర్‌రెడ్డి, డీవైఎస్ఈ సోలార్ ఎనర్జీ వీరనాయక్, డీ రమేశ్, జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ దీపక్, డీవైఎఫ్ఎం చిన్నిప్రసాద్ దీక్షలో కూర్చున్నారు. వీరికి అన్ని డిపార్ట్మెంట్ల జీఎంలు, హెచ్వోడీలు మద్దతు తెలిపారు. సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధికారులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసన చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట దీక్షా శిబిరాన్ని ఇల్లెందు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి, టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలోనే అధికారులు మొట్టమొదటిసారిగా రోడ్డెక్కి ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టడం ప్రభుత్వానికే సిగ్గుచేటని అన్నారు. కాగా గోదావరిఖనిలోని ఆర్జీ1 జీఎం ఆఫీస్ ఎదుట అధికారులు నల్ల కండువాలతో దీక్షలో కూర్చున్నారు. సింగరేణి అధికారులకు మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్పీ బకాయిలు చెల్లించాలని, వేతన సవరణ చేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సందర్శించి, మద్దతు ప్రకటించారు.