పెద్దపల్లి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): పుడమి తల్లి ఒడిలో పనిచేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీసే నల్లసూర్యుల ఆరోగ్యంపై సింగరేణి యాజమాన్యం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిరంతరం శ్రమిస్తూ సింగరేణికి సిరులు కురిపిస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు దేశ, విదేశీ, నియోజకవర్గాల్లో పర్యటనలకు రూ. కోట్లాది ఖర్చు చేస్తూ వారి ప్రసన్నం కోసం ప్రాయాసపడుతున్నది. సంస్థకు సంబంధం లేని గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు సైతం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది.
కానీ, ప్రాణాలను పణంగా పెట్టి తమ స్వేదాన్ని చిందిస్తూ కోట్లాది రూపాయల లాభాలను కురిపిస్తున్న కార్మికులను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. కార్మికుల ప్రాణాలు పోతే మా కేం..వారి శ్రమతో వచ్చే లాభాలే ముఖ్యం అనే రీతిలో సింగరేణి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. వందల కోట్లు వృథా చేస్తూ, వేల కోట్ల బకాయిలు వసూళ్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యం మూ డు కోట్లు ఖర్చు చేసి పని స్థలాల్లో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సింగరేణి.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో 22 భూగర్భ గనులు, 19 ఉపరితల గనులు మొత్తంగా 41 గనులను కలిగి ఉంది. 41 వేల మంది పర్మినెంట్ కార్మికులు, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వంగా 71 వేల కుటుంబాలతో అనుసంధానమైన సింగరేణి యాజమాన్యం ప్రకృతికి విరుద్ధంగా.. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల ప్రమాదాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా 7 ఏరియా దవాఖానలు 22 డిస్పెన్సరీలతో వైద్య సేవలను అందిస్తున్నది. సింగరేణి ఏరియాల్లో కాలనీల్లోని ప్రజలకు, సింగరేణి భూగర్భ, ఓపెన్ కాస్టు గనుల్లో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు కేవలం 67 అంబులెన్స్‌లను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో సగానికిపైగా శిథిలమైపోయాయి. వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడంలో జాప్యం చేయడంతోపాటు అవసరమైనన్ని తీసుకురావడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. నిత్యం ప్రమాదాల మధ్యే కార్మికులు పనిచేస్తున్నా పని ప్రదేశాల్లో ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు.
రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3ల పరిధిలో ఓసీపీ-3, 7 ఎల్పీ, ఓసీపీ-5, వకీల్‌పల్లి, ఓసీపీ-1, ఓసీపీ-2 ఎఫ్ 2, అడ్య్రాల లాంగ్వాల్(ఏఎల్పీ), 10ఏ, 11ఇైంక్లెన్లు, 8 వరకు సీఎస్పీలు ఉన్నాయి. వీటి పరిధిలో 11 ఇైంక్లెన్ మినహా ఎక్కడా ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే పని స్థలానికి అంబులెన్స్ రావడానికి కనీసం గంట పట్టే అవకాశం ఉంది. గనులు, ఓపెన్ కాస్టుల్లో సీహెచ్పీల వద్ద ఏదైనా బొగ్గు పెల్లలు పడి ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ వచ్చేలోగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమ ప్రాణాలను పట్టించుకోవాలని ప్రతి భూగర్భ, ఓసీపీ, సీహెచ్పీల వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
సింగరేణి గనుల్లో తరచూ జరిగే ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు గనుల వద్దే అత్యవసర సేవలతో కూడిన అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలి. ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించడంలో ఆలస్యం జరిగితే.. కార్మికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. గనుల్లో పనిచేస్తున్న కార్మికులం కష్టపడి బొగ్గు తవ్వుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగినప్పుడు తక్షణం వైద్యం అందించకపోతే ప్రాణాలు పోతాయి. అన్ని వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌ను గని వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలి. ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, కార్మికుల ప్రాణాలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – దాసరి మల్లేశ్, జనరల్ అసిస్టెంట్, ఓసీపీ-2(రామగుండం-3).
బొగ్గు గనుల వద్ద అన్ని సౌకర్యాల తో కూడిన సంజీవ ని అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలి. మేం ప్రతి రోజూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బొగ్గు వెలికితీస్తున్నాం. ప్రమాదం జరిగితే.. స మయానికి వైద్యసహాయం అందక ప్రా ణాలు పోతున్నాయి. ప్రతి మైన్ వద్ద సం జీవని అంబులెన్స్ ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
-సైండ్ల సత్యనారాయణ, ఈపీ ఆపరేటర్ ఓసీపీ-1
సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉ న్నా.. అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తాం. అవసరం మేరకు కొనుగో లు చేస్తున్నాం. ఇటీవలే కొత్తగా ఆరు కొనుగోలు చేశాం. భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల వద్ద పెట్టాలనే ఆలోచన ఉంది. దానికి సమయం పడుతుంది. ఉన్న అంబులెన్స్‌లను సమీపంలోనే ఉంచుతున్నాం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే చేరుకునే విధంగా అప్రమత్తంగానే ఉన్నాం.
-కిరణ్‌రాజ్‌కుమార్, సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్, కొత్తగూడెం