హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎండీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు యాజమా న్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం ఇతరత్రా కారణాలతో వీరిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
అయితే తిరిగి విధుల్లోకి తీసుకొనే అంశంపై ఇటీవల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా వీరిని తాజా నియామకంగా గుర్తిస్తారు. వీరందరు సంస్థ ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ వద్దకు వెళ్లి తమ వివరాలు, ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
అనంతరం మెడికల్ ఫిట్నెస్ టెస్ట్‌కు హాజరుకావాలి. వాటి ఆధారంగా ప్రైమరీ అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు. ఉద్యోగంలో చేరిన ఇంజినీర్ ట్రైనీలు మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా 190 మస్టర్లకు తగ్గకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి త్వరలోనే నియామకపత్రాలు అందజేస్తామని సింగరేణి సీఎండీ బలరాం ప్రకటించారు.