(ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి- నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వరంగ సంస్థలు ఎంత అద్భుతమైన ఫలితాలు సాధించగలవో అర్థం చేసుకోవడానికి సింగరేణి సంస్థే తిరుగులేని ఉదాహరణ. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఏండ్లు నష్టాలతో సతమతమైన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచి పనితీరు కనబరుస్తున్నది. ఏటేటా లాభాలు ఆర్జిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు లాభాల్లో వాటాలు పంచిపెడుతున్నది. వివిధ పన్నులు, సెస్సులు, లాభాల రూపంలో కేంద్ర ప్రభుత్వానికే గడిచిన ఎనిమిదేండ్లలో రూ.22,732.53 కోట్లు ముట్టజెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి లాభాల్లో వాటాగా రూ.17,720.03 కోట్లు అందజేసింది. సంస్థ అభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్న కార్మికులకు సైతం లాభాల్లో వాటాలు పంచిపెడుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో 2008-09లో ఒక్కొక్క కార్మికుడికి సగటున రూ.10 వేల చొప్పున పీఎల్ఆర్ఎస్ ఇవ్వగా తెలంగాణ వచ్చిన తరువాత 2020-21లో రూ.72,500 చెల్లించడం విశేషం. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలోనే సాధ్యమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్‌ను సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించి, దిశానిర్దేశం చేశారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై ఇప్పటివరకు సానుకూలంగా స్పందించని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు వ్యూహరచన చేస్తున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సింగరేణి పరిధిలోని రెండు బొగ్గు బ్లాక్‌లను సంస్థకు కేటాయించకుండా బహిరంగ వేలానికి పిలవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నది. ఒకనాడు బొగ్గు తవ్వకాలకే పరిమితమైన సింగరేణి సంస్థ ఇప్పుడు థర్మల్, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి రంగంలోనూ అడుగుపెట్టడమే కాదు లాభాలు సైతం ఆర్జిస్తున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీరుస్తూనే దక్షిణాది రాష్ర్టాల్లోనూ వెలుగులు విరజిమ్ముతున్నది. 13 రాష్ర్టాలకు బొగ్గును ఎగుమతి చేస్తున్నది. ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, కార్మిక సంక్షేమం.. ఇలా ఏరకంగా చూసినా సింగరేణి సంస్థ మహారత్న సంస్థలతో పోటీ పడుతున్నది. 2013 నుంచి 2020 వరకు దేశంలోని మహారత్న కంపెనీలలో ఒకటైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తరువాత టర్నోవర్‌లో అత్యధిక వృద్ధి రేటు సాధించిన ఘనత సింగరేణికే దక్కింది. 2013-14లో రూ.11.9 వేల కోట్లుగా ఉన్న టర్నోవర్ 2021-22లో రూ. 26 వేల కోట్లకు పెరగడం స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి నిదర్శనం. ఎనిమిదేండ్లలో కారుణ్య నియామకాలు, ఇతర రిక్రూట్మెంట్ల ద్వారా మొత్తం 16,966 మందికి ఉద్యోగాలు కల్పించింది. గడిచిన ఎనిమిదేండ్లలో చేసిన శ్రమ మరో యాభై ఏండ్ల భవిష్యత్తును వాగ్ధానం చేస్తున్నది.
సౌర విద్యుత్తులోనూ అదే జోరు
300 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించిన సింగరేణి ఇప్పటికే ఎనిమిది ప్రాంతాల్లో 219 మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. వీటి ద్వారా 2022 మార్చి 31 నాటికి 266.37 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దీనితో సింగరేణి చెల్లిస్తున్న విద్యుత్తు బిల్లుల్లో రూ.130.20 కోట్ల వరకు ఆదా అయ్యింది. సమీప భవిష్యత్తులో 1,500 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ)లో ఫ్లోటింగ్ పద్ధతిలో సుమారు 350 మెగావాట్ల మెగా ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది.
థర్మల్ విద్యుత్తులో రికార్డుల హోరు
కేవలం బొగ్గు తవ్వకాలు, రవాణాకే పరిమితం కాకుండా తానే స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న ఆకాంక్షతో ముందుకొచ్చిన ఏకైక సంస్థ సింగరేణి. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు 2010లోనే ప్రణాళికలు రూపొందించినప్పటికీ అప్పటి సమైక్య పాలకులు దానిని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రోత్సాహంతో 2016 నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ)లో విద్యుత్తు ఉత్పత్తి మొదలయ్యింది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో 80 శాతానికి పైగా రాష్ట్ర అవసరాలకే వినియోగిస్తున్నది. ఈ ప్లాంటు ఏటా సగటున రూ.400 కోట్ల లాభాలు ఆర్జిస్తున్నది. 800 మెగావాట్ల సామర్థ్యంతో మూడో యూనిట్‌ను నిర్మించేందుకు సింగరేణి సమాయత్తమవుతున్నది. దీంతో ఎస్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2,000 మెగావాట్లకు పెరగనున్నది.
ఆరు జిల్లాల ప్రగతికి సింగరేణి అండ
సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని గనుల చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) కింద 2015 నుంచి 2022 వరకు రూ.3,423 కోట్ల నిధులను ఆయా జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలకు జమచేసింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటివి చేపడుతున్నారు. దీనికి తోడు సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద సుమారు రూ.250 కోట్ల వరకు ఖర్చు చేసింది. 120 గ్రామాలు, 15 పట్టణ ప్రాంతాల్లో ఈ నిధులను వెచ్చించారు.
దేశంలోనే నం.1గా నిలబెడతాం
సింగరేణి సంస్థను దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా రూపొందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో సింగరేణి లాభాల బాటలో నడుస్తున్నది. కేవలం సంప్రదాయ బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా, థర్మల్, సౌర విద్యుత్తు ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించాం. భవిష్యత్తులో వినూత్న వ్యాపారాల్లోకి ప్రవేశిస్తాం. సింగరేణి సంస్థ ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించింది. మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను చేపడుతున్నది. సౌర విద్యుత్తు ఉత్పత్తిలోనూ లాభాలు ఆర్జిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి టర్నోవర్ రూ.11.9 వేల కోట్ల నుంచి రూ.26.6 వేల కోట్లకు చేరింది. వచ్చే యాభై ఏండ్ల వరకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు రాకుండా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాం.
– ఎన్ శ్రీధర్, సింగరేణి సీఎండీ